ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ చేదువార్తను చెప్పింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తారా స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో మే ఒకటో తేదీ నుంచి 18 యేళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా వేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే, ఏపీ సర్కారు మాత్రం టీకా వేయలేమని తేల్చి చెప్పింది.
దీనికి కారణం ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఈ తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా టీకాను 18 ఏళ్లు నిండిన వారికి జూన్ నుంచి ఇచ్చే అవకాశం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే ముందు కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరని చెప్పారు.
అందుకే, పేర్ల నమోదు ప్రక్రియ తేదీ కూడా ఇంకా ప్రకటించలేదని గుర్తుచేశారు. త్వరలోనే రిజిస్ట్రేషన్ తేదీని ప్రకటిస్తామన్నారు. ఈ కారణాలతోనే మే 1 వ తేదీకి కరోనా టీకను 18 ఏళ్లు నిండిన వారికి ఇచ్చే అవకాశం లేదన్నారు. జూన్ మొదటి వారంలో 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ పంపిణీ జరిగే అవకాశం ఉందని తెలిపారు.
అదేసమయంలో కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో 50 మంది పాల్గొనడానికే అనుమతి ఉంటుంది. ఈ విషయంలో జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు.
ఇక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్‌లు మూసివేసినట్టు తెలిపారు. ప్రజారవాణా, సినిమా హాళ్ళు 50 శాతం సీట్ల సామర్ధ్యంతోనే నడుస్తాయి. అదేవిధంగా ఆసుపత్రులు అన్నిటిలోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.