తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చిత్తూరు జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ... ' ప్రజలు తమ సమస్యలను చెప్పుకుంటారని ప్రజావేదికను నిర్మిస్తే దాన్ని కూల్చి వేశారు. కూల్చివేతలతో ప్రారంభమైన మీ ప్రభుత్వం కూలిపోతుంది.
పులివెందుల పంచాయతీ చేద్దామని సీఎం జగన్ అనుకుంటున్నారు. పులివెందుల పంచాయతీ చేద్దామని ప్రయత్నిస్తే పులివెందుల పంపిస్తాం. ఆయన సీఎంగా వచ్చినప్పటి నుంచి ఒక్క పని కూడా చేయలేదు. 6 నెలలు మంచి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకుంటానని అన్నారు, కానీ చెత్త ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నారు.
మన ఇసుక చెన్నై, బెంగళూరు, హైదరాబాదు వెళ్లిపోతోంది. పంచాయతీరాజ్ కాంట్రాక్టరుకి పంచాయతీరాజ్ శాఖామంత్రి పదవి ఇచ్చారు జగన్ చాలా తెలివిగా. ప్రజలు ఇక్కట్లు పడుతుంటే సీఎం మాత్రం చక్కగా వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. ఇసుక సమస్యపై పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తే ఆయనను మనోవేదనకు గురయ్యేట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
మీ పార్టీ ఎమ్మెల్యే వస్తే అమ్మాయిలను పెట్టి డ్యాన్సులు చేయిస్తారా? 30 లక్షల మంది భవన కార్మికుల గోడు మీకు పట్టదా? తమ్ముళ్లూ, ఓ మంత్రి అంటారు నేను కత్తి పట్టుకుని దోమలపైన యుద్ధం చేశానని. ఔను, నేను దోమలపైన యుద్ధం చేశాను, కత్తితో యుద్ధం చేశా. ఎలాంటి అంటురోగాలు లేకుండా చేశా. ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ డెంగీ, బయటకు రావాలంటే భయమేస్తోంది.