అమిత్‌ షా వ్యూహంలో భాగంగానే నన్ను తప్పించారా.. ఏం మాటలివి.. తిప్పికొట్టిన వెంకయ్య

సోమవారం, 24 జులై 2017 (08:48 IST)
రాజకీయ అనుభవం ఏమాత్రం లేని వాళ్లు.. బీజేపీపై పూర్తిగా తప్పుడు అభిప్రాయం ఉన్న వాళ్లు పనికట్టుకుని...  2019లో మోదీకి అడ్డం వస్తానన్న దురాలోచనతో బలవంతంగా తనను ఉప రాష్ట్రపతిని చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి అడ్డు తొలగించుకోవడానికి, ఆయన నోటికి తాళం వేయడానికి, ఏపీ, తెలంగాణల్లో పార్టీ ఎదగడానికి అడ్డు పడుతున్న వెంకయ్యకు తగిన శాస్తి చేయడానికే ఆయనను క్రియాశీల రాజకీయాల్లో నుంచి దూరం చేశారంటూ తెలుగు మీడియాలోనూ, జాతీయ మీడీయాలోనూ దుమారం కలిగిస్తున్న వార్తలపై వెంకయ్యనాయుడు స్పష్టత నిచ్చారు.
 
దారుణమైన విషయం ఏమిటంటే.. అమిత్‌ షా వ్యూహంలో భాగంగానే తనను ప్రత్యక్ష రాజకీయాలనుంచి తప్పించారని ప్రచారం చేస్తున్నారని, ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే, అమిత్‌ షా అభిమానించే నాయకుల్లో తానూ ఒకడినని తెలిపారు. ‘‘నేను నా భవిష్యత్తును దిశానిర్దేశం చేసుకున్నాను. 2019లో మోదీని మళ్లీ ప్రధానిని చేసి 2020లో రాజకీయాలను వదిలి ప్రజా సేవకు వెళ్లాలని ఎప్పుడో నిర్ణయించుకున్నా. ఈ విషయాన్ని స్వయంగా మోదీ, అమిత్‌ షాలకు కూడా చెప్పాను. మోదీ మాత్రం 2019కి ఇంకా సమయం ఉంది. ఇప్పుడే రాజకీయ సన్యాసం గురించి ఎక్కడా మాట్లాడవద్దని పదే పదే చెప్పారు. 
 
ఇదే విషయాన్ని నా సతీమణికి ఎప్పుడో చెప్పా. మీడియాకు గతంలో ఇచ్చిన ఇంటర్యూలో ఆమె కూడా ఈ విషయాన్ని తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉంటూనే ఆ పదవిని వదిలి సమాజ సేవకు వెళ్లి అందరికీ ఆదర్శంగా ఉండాలని అనుకున్నా. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేయాలనుకున్నా. కొత్తవారికి అవకాశం ఇవ్వాలనుకున్నా. అంతేకానీ, నన్ను ఎవరో బలవంతంగా పంపించి వేశారన్న విషయం నిజం కాదు’’ అని వెంకయ్య వివరించారు. 
 
తన పేరును ప్రతిపాదించినప్పుడు ఇష్టం లేదని అమిత్‌ షాకు స్వయంగా చెప్పానని తెలిపారు. తాను ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఈరోజు చేసిన పని సరైనదా కాదా అని ఆలోచిస్తానని, ఉప రాష్ట్రపతి పదవి కూడా మంచిదేనని తన మనసుకి తోచిందని తెలిపారు. ఇటీవల ప్రణబ్‌ను కలిసినప్పుడు కూడా ఆయన ఇదే మాట చెప్పారని వెల్లడించారు. ఉప రాష్ట్రపతి తక్కువైన పదవేమీ కాదు. ఈ పదవి కోసం ఎవరెవరు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారో అందరికీ తెలుసు. ఉద్యమాలే ఊపిరిగా ఎదిగి, రాజకీయాల్లో పలువురి ప్రముఖుల ప్రశంసలు పొందిన నేను ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నా. ఇక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఉన్నతమైన స్థానంలో కూర్చొని మరింత ఉన్నతంగా ఆలోచిస్తా’’ అని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. 
 

వెబ్దునియా పై చదవండి