కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపుమేరకు టిటిడిలో అక్టోబరు 26 నుండి నవంబరు 1వ తేదీ వరకు విజిలెన్స్ అవగాహన భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడంతో పాటు భక్తులకు అవగాహన కల్పించడానికి తిరుమలతోపాటు అన్ని ఆలయాలు, కార్యాలయాల్లో కార్యక్రమాలు చేపట్టారు.
అక్టోబరు 26వ తేదీన టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి టిటిడి పరిపాలనా భవనంలో అధికారులు, సిబ్బంది చేత అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి వారోత్సవాలు ప్రారంభించారు. 27న సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి టిటిడి పరిపాలనా భవనం వద్ద రెండు కిలోమీటర్ల వాక్‌థాన్ ప్రారంభించి అలిపిరి టోల్‌గేట్ వరకు నడిచారు.
ఈ సందర్భంగా ఆయన భక్తులకు అవినీతిరహిత సేవలు అందించాలని, ఓపికతో వ్యవహరించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని విజిలెన్స్ సిబ్బందికి పిలుపునిచ్చారు. 28న శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిలో విజిలెన్స్ సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 82 మంది అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు.
అక్టోబరు 29న టిటిడిలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవినీతి వ్యతిరేక అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. 30, 31వ తేదీల్లో టిటిడి అనుబంధ ఆలయాలు, రద్దీ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
నవంబరు 1న సైకిల్ ర్యాలీ నిర్వహించి, రాత్రి తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో విజిలెన్స్ అవగాహన భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 34 మంది అధికారులు, సిబ్బందికి బహుమతులు ప్రదానం చేశారు.