సారీ సర్.. నేను ఆ పదవికి అర్హుడను కాను : కేశినేని నాని షాక్

బుధవారం, 5 జూన్ 2019 (11:34 IST)
తెలుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తేరుకోలేని షాకిచ్చారు. తాను టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఉపనేత పదవికి అర్హుడను కాదని పేర్కొంటూ ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారు. పైగా, తనకంటే సమర్థుడైన నేతను ఆ పదవికి ఎంపిక చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన ఫేస్‍‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 
 
కాగా, ఎంపీ కేశినేని నానిని లోక్‌సభలో టీడీపీ ఉపనేతగా, పార్టీ విప్‌గా ఎన్నుకోగా, సీఎం రమేశ్‌ను రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్నారు. ఈ పదవి ప్రకటించి 24 గంటల్లో ఆయన యుటర్న్ తీసుకున్నారు. ఈ పదవికి తాను సరిపోనని.. తనకంటే సమర్థుడైన మరో వ్యక్తిని పార్టీ విప్ పదవికి ఎంపిక చేయాలని కోరుతూ కేశినేని శ్రీనివాస్ చంద్రబాబుకు లేఖ రాశారు. 
 
తనను విప్ పదవిలో నియమించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ తాను ఈ పదవికి అర్హుడిని కాను. విప్ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోవచ్చునని అనుకుంటున్నానని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు సీట్లకే పరిమితమైంది. విజయవాడ నుంచి కేశినేని శ్రీనివాస్, శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ గెలుపొందారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు