సరిగ్గా రెండు రోజుల క్రితం విశాఖలోని అక్కయ్యపాళెం, చెక్కులూరు బిల్డింగ్ దగ్గర ఒక యువతి హత్య. కనుబొమలు కత్తిరించారు. గుండు గీశారు.. ఒళ్ళంతా వాతలు పెట్టారు. దారుణమైన హత్యగా భావించిన పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. కేసును సవాల్‌గా తీసుకున్నారు.
పోలీసుల విచారణలో విస్మయానికి గురిచేసే విధంగా ఆ యువతి హత్య జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వసంత, ఆమె చెల్లెలు ఇద్దరు కలిసి దివ్యను చంపేశారు. అందుకు కారణం డబ్బుల పంపకంలో వ్యత్యాసం రావడమే. అందంగా ఉన్న దివ్యను వ్యభిచారంలోకి దింపింది వసంత.
బాగా డబ్బులు సంపాదించడం ప్రారంభించింది దివ్య. తాను ఉంటున్న అపార్టుమెంటులోనే ఈ వ్యవహారం మొత్తం నడిచేది. వసంత పరిచయం చేసే వ్యక్తులు, వాళ్ళ ద్వారా పరిచయమైన మరికొంతమందితో దివ్య శారీరక సంబంధం పెట్టుకుంటూ వచ్చింది. మొదట్లో వీరి మధ్య ఎలాంటి తగాదాలు లేవు.
కానీ వసంత పరిచయం చేసిన వ్యక్తుల నుంచి దివ్య ఎక్కువగా డబ్బులు వసూలు చేయడం.. వసూలు చేసిన డబ్బులను వసంతకు ఇవ్వకపోవడంతో వీరి మధ్య గొడవకు కారణమైంది. దీంతో దివ్యను ఆపార్టుమెంటులోని తన గదిలోనే కట్టేసిన వసంత, ఆమె చెల్లెలు ముందుగా కనుబొమలు కత్తిరించారు.
ఆ తరువాత ఒంటిపై వాతలు పెట్టారు. అలాగే గుండు గీశారు. దీంతో వదలకుండా ఆమెను దారుణంగా చంపేశారు. దివ్య సంపాదించిన డబ్బును బీరువాలో దాచుకుంది. అలాగే నగల రూపంలో కొనుక్కుంది. వాటిని తీసుకుని ఉడాయించారు. పోలీసులు ఈ కేసును ఛేదించి హత్య చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో ఈ హత్య తీవ్ర సంచలనంగా మారుతోంది.