యువతకు ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ముఖ్య ఉద్దేశమని ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్(ఈఎంసీ), డిజిటల్ లైబ్రరీలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు.
సమీక్షకు పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వైఎస్‌ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్(ఈఎంసీ) సీఈఓ ఎం నందకిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అన్ని గ్రామ పంచాయతీల్లో రెండేళ్లలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. విశాఖ, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్దేశించారు.