విశాఖ దుర్ఘటన, సీఎం జగన్‌కు నా సెల్యూట్: పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి

శుక్రవారం, 8 మే 2020 (13:40 IST)
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటనపై నటుడు ఆర్. నారాయణమూర్తి మాట్లాడారు. ఆయన మాటల్లోనే... "ఎల్జీ పాలిమార్స్ ఫ్యాక్టరీ నుంచి విష వాయువు లీక్ అవడం అనేక మంది చనిపోవడం వందలాది మంది ఆస్పత్రుల పాలవ్వడం అనేక జంతువులు చనిపోవడం చాలా మంది భయభ్రాంతులకు గురయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో యావత్ ప్రపంచం చిన్నాభిన్నం అయిపోతున్న సమయంలో ఉత్తరాంధ్రలో ఈ ఘటన జరగడం హృదయ విదారకం. ఏడుపోస్తుంది. 
 
మన భారతదేశంలో పివి నరసింహారావు గారు ప్రధానిగా వున్నప్పుడు, మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా వున్నప్పుడు 85, 90 దశకంలో WTOతో కుదుర్చుకున్స ఒప్పందాల వల్ల జరిగిన దుష్పరిణామాల్లో ఇదొకటి. ఏ బహుళ జాతి కంపెనీలను, ఏ కార్పొరేట్ శక్తులను, ప్రైవేట్ శక్తులను అభివృద్ధి పేరుతో మన దేశంలో కి ఆహ్వానిస్తున్నామో... దాని దుష్పరిణామమే ఈరోజు దక్షిణ కొరియాకి సంబంధించిన కంపెనీలో జరిగిన దుర్ఘటన.
 
ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పచ్చని ఉత్తరాంధ్ర ఉడుకుతోంది. కేవలం కొంతమంది స్వార్ధపరులు అభివృద్ధి పేరుతో ఉత్తరాంధ్రను దుష్పరిణామాలకు ప్రయోగంగా చేస్తున్నారు. ఎల్జీ పాలిమార్స్ సంస్థను ప్రధాని మోడీ నిషేధించాలి. వాళ్ళ నుంచి కోట్ల రూపాయల నష్ట పరిహారం తీసుకోవాలి. వాళ్ళను శిక్షించి న్యాయం చేయాలి. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా నష్టపోయింది.
 
శ్రీకృష్ణ కమిటీ రాయలసీమ, ఉత్తరాంధ్రా బాగా వెనుకబడిన ప్రాంతాలు వాటికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పింది. NDA గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యెక హోదా ఇస్తాము అన్నారు. కానీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వకున్నా, ప్రత్యేక పాకేజ్‌లు ఇవ్వకున్నా ఎన్నికల్లో YS జగన్మోహన్ రెడ్డి గారు ఏ నవరత్నాలు ప్రకటించారో అవన్నీ సమర్ధంగా అమలు చేస్తున్నారు.
 
కరోనా మహమ్మారిని తట్టుకొని ప్రజలకు ది బెస్ట్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో నిధులున్నాయా లేవా అని కూడా చూడకుండా ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి ఆర్థిక సహాయం ప్రకటించి మానవీయ కోణం చూపిస్తున్నందుకు జగన్ మోహన్ రెడ్డికి నా సెల్యూట్. నరేంద్రమోదీ గారు మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రత్యేక ప్యాకేజి ఇవ్వలేదు. జాతీయ విపత్తు నిధి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నిధులు మంజూరు చేసి జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ క్లిష్ట పరిస్థితుల్లో చేయూతనిచ్చి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోండి"

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు