బీజేపీ నమ్మకద్రోహానికి పాల్పడుతోంది : ఉండవల్లి అరుణ్ కుమార్

సోమవారం, 2 మార్చి 2015 (09:08 IST)
నాడు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తే.. ఇపుడు బీజేపీ నమ్మక ద్రోహానికి పాల్పడుతోందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రజలు ఒకసారి మోసపోతే, మరోసారి ఆంధ్రుల్ని మోసం చేసేందుకు బీజేపీ నేతలు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు కొత్త కొత్త భాష్యాలు చెబుతూ ఆంధ్రుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విభజన చట్టాలను అమలు చేయండని అడిగితే, లీగల్‌గా ఉన్నవన్నీ అమలు చేస్తామని అరుణ్ జైట్లీ అంటున్నారని ఆయన చెప్పారు. అసలు విభజనలో న్యాయం ఉందా? అని ఆయన నిలదీశారు. చట్టప్రకారం తాము నో-కాన్ఫిడెన్స్‌మోషన్ ఇస్తే, దానిని చర్చకు రాకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకోలేదా? అని ఆయన నిలదీశారు. 
 
అధికార పక్షం, ప్రతి పక్షం కలిసి ప్రజలను ముంచే రోజున ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని రాజ్యాంగంలో కొన్ని హక్కులు, నిబంధనలు కల్పించారని ఆయన తెలిపారు. బీజేపీ నేతలు గతంలో అన్న మాటలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. పిల్లకు జన్మనిస్తూ తల్లిని హత్య చేశారన్న మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. నేతలు బాగానే ఉంటారని అన్న ఆయన, ప్రజలను రక్షించాల్సిన బాధ్యత వారిదేనని సూచించారు.
 
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండెకాయలాంటిదన్నారు. అలాంటి పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. బిల్లులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే, ఇప్పటి వరకు దానికి 5 వేల కోట్లు ఖర్చయ్యాయన్నారు. దానిని మూడు, నాలుగు ఏళ్లలో పూర్తి చేయాలంటే ఏడాదికి 4 నుంచి 5 వేల కోట్లు విడుదల చేయాలన్నారు. అలాంటిది బీజేపీ కేవలం వంద కోట్లు విదిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి