విచారణ మొదలు పెట్టి మూడురోజులు కాలేదు. అప్పుడే అంతర్జాతీయ మాఫియా నుంచి బెదిరింపు కాల్ వచ్చేసింది. నేరుగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కు కాల్ చేసిన మాఫియా దుండుగులు ఆఫ్రికన్ భాషలో దూషిస్తూ బెదిరించారు. ఉన్నఫళంగా విచారణ నిలిపేయకపోతే నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తమకు తెలుసంటూ బెదిరించారు. హైదరాబాద్‌లో లాగిన తీగ అంతర్జాతీయ మాఫియా డొంకంతా కదిల్చినట్లు స్పష్టమవుతోంది. వారంరోజులుగా అకున్ సబర్వాల్‌కు ఇదేవిధమైన బెదిరింపులు వస్తున్నాయని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారం అంతు తేల్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. డ్రగ్స్ విచారణ ఉన్నపలంగా నిలిపేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు కాల్ చేసి హెచ్చరికలు చేశారు. అకున్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తమకు తెలుసంటూ బెదిరించారు. ఇంటర్నెట్ ద్వారా అగంతుకుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన డ్రగ్స్ మాఫియా ముఠాకు చెందిన వ్యక్తి ఆఫ్రికన్ భాషలో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు వారం రోజులుగా కూడా ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయంట. దీంతో డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు మొదలయ్యాయి.
ఇప్పటికే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ ముఠా నెదర్లాండ్, ఐరోపాలోని పలు దేశాలు, అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు కెల్విన్ ద్వారానే అంతర్జాతీయ మాఫియా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు స్పష్టమైంది. దీంతో డ్రగ్స్ మాఫియా తాజాగా చేసిన ఫోన్ కాల్స్‌పై ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది.
ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఇప్పటి వరకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామేన్ శ్యామ్‌కే నాయుడు, నటుడు సుబ్బరాజును విచారించిన విషయం తెలిసిందే. సుబ్బరాజు విచారణ ఆధారణంగా తాజాగా మరో 15మంది సినీనటులకు నోటీసులు పంపించనున్నారు. నేడు (శనివారం) తరుణ్ విచారణ జరగనుంది.