జీఎస్టీ పన్నుల విధానంలో జోక్యం చేసుకోలేం...

శనివారం, 13 అక్టోబరు 2018 (14:00 IST)
అమరావతి : జీఎస్టీ పన్నుల విధానంలో జోక్యం చేసుకోలేమని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ స్పష్టం చేశారు. వినోదపు పన్నును జీఎస్టీ నుంచి మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ద్వారా తీసుకెళ్లాలని నగర, మున్సిపాల్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఆయన సూచించారు. తాము కూడా ఇదే విషయమై కౌన్సిల్ దృష్టికి తీసుకెళతామన్నారు. ఆదాయం పెంచుకునే మార్గాలు సృష్టించుకోవాలని సూచించారు.
 
ఆస్తి పన్నులు పెంచాలన్న ఆర్థిక సంఘ సభ్యుల సూచనలను ప్రజాప్రతినిధులంతా సాధ్యం కాదని తెలిపారు. తమకు నిధులిచ్చి ఆదుకోవాలని 15వ ఆర్థిక సంఘ సభ్యులను నగర, మున్సిపాల్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో కోరారు. సచివాలయంలోని అయిదో బ్లాక్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ లో నగర, మున్సిపాల్టీ పాలక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులతో 15వ ఆర్థిక సంఘ భేటీ అయ్యింది. నగర, మున్సిపాల్టీల అవసరాలు, నిధుల కేటాయింపుపై ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల నుంచి ఆ సంఘ సభ్యులు అభిప్రాయాలు సేకరించారు. ప్రజాప్రతినిధుల మాటల్లోనే వారి వివరాలు... 
 
1. కోన శ్రీధర్, టీడీపీ, మేయర్, విజయవాడ :
జీఎస్టీ పరిధిలో వినోదపు పన్ను చేర్చడంతో విజయవాడ కార్పొరేషన్ రూ.18 నుంచి 19కోట్లు నష్టపోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా రూ.130 కోట్ల వరకూ పాలక వర్గాలు కోల్పోయాయి.
జీఎస్టీ ద్వారా పన్నుల రూపంలో వచ్చిన మొత్తాల్లో నగర, మున్సిపాల్టీలకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
రాష్ట్ర విభజన తరవాత ఏపీకి విజయవాడ రాజధానిగా మారింది.
ఆదాయం తగ్గిపోవడంతో కార్పొరేషన్ నిర్వహణ భారంగా మారింది.
 
2. ఎం, స్వరూప, టీడీపీ, మేయర్, అనంతపురం :
విభజనతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయింది.
14వ ఆర్థిక సంఘం ఆశించిన స్థాయిలో నిధులు రాలేదు.
15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాలి.
 
3. కె.మహాలక్ష్మి, వైఎస్ఆర్ సిపి., చైర్ పర్సన్, తాడేపల్లి :
మున్సిపాల్టీల జనాభా ప్రాతిపదికన కాకుండా విస్తీర్ణం దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించాలి.
 
4. డి.శారద, టీడీపీ, చైర్ పర్సన్, తాడేపల్లి :
రాష్ట్ర విభజనతో మున్సిపాల్టీలు అభివృద్ధి కష్టంగా మారింది.
15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాలి.
 
5. కె.గాయిత్రిదేవీ, టీడీపీ, చైర్ పర్సన్, డోన్ :
బిడ్డల్లాంటి మున్సిపాల్టీలను తల్లి స్థానంలో ఉన్న కేంద్రం, 15వ ఆర్థిక సంఘం విరివిగా నిధులిచ్చి ఆదుకోవాలి.
వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే తిరిగి తీసుకున్న నిధులివ్వాలి.
 
6. శ్రీనివాసరావు, టీడీపీ, చైర్ పర్సన్, గుడివాడ :
2011 జనాభా ప్రాతిపదికన కాకుండా 1971 జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు నిధులు కేటాయించాలి.
 
ఈ సమావేశంలో 15వ ఆర్థిక సంఘం సభ్యులు డాక్టర్ అశోక్ లహిరి, డాక్టర్ అనూప్ సింగ్, శక్తి కాంత్ దాస్, ప్రొఫెసర్ రమేష్ చంద్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర, సీడీఎంఏ కన్నబాబు, నగర, మున్సిపాల్టీలకు చెందిన పలువురు మేయర్లు, చైర్ పర్సన్లు హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు