రాయలసీమ నుంచి పవన్ కల్యాణ్ ఎలా పోటీ చేస్తారు?.. తిరగనిచ్చే ప్రసక్తే లేదు: కుంచం

శనివారం, 27 మే 2017 (12:31 IST)
రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి కొత్త వాదనకు తెరపైకి తెచ్చారు. రాయలసీమ సమస్యల పరిష్కారానికి.. సీమ అభివృద్ధికి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమే పరిష్కారమన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కుంచం డిమాండ్ చేశారు. పనిలో పనిగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను ఏకిపారేశారు. పవన్ కల్యాణ్ రాయలసీమలో ఎలా పోటీ చేస్తారని కుంచం వెంకట సుబ్బారెడ్డి ప్రశ్నించారు. 
 
గుంటూరులో కుంచం వెంకట సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పాలకులందరూ సీమ ప్రజలను వాడుకున్నారు. అయితే సీమ ప్రజలు వారు చేసేందేమీ లేదని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్‌ సైతం అదేధోరణిలో నడుస్తున్నారని విమర్శించారు. గతంలో పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి సీమ నుంచి గెలిచి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. 
 
ఇలా సీమ నుంచి ఎందరో సీఎంలు వచ్చినా.. సీమకు ఒరగబెట్టిందేమీ లేదని సుబ్బారెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు సైతం సీమపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి పేరుతో ఉన్నదంతా కోస్తాకే దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
గతంలో టీజీ వెంకటేష్ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం డిమాండ్‌గా ఆందోళనలు చేశారు. ఎంపీ అయ్యాక ఆయన నోరు మెదపడం లేదు. తనకు పదవి వచ్చింది కాబట్టి సీమ ప్రజలను టిజి వెంకటేష్ పట్టించుకోవడం లేదని సుబ్బారెడ్డి అన్నారు. ఇదే తరహాలోనే బీజేపీ, టీడీపీకి కొమ్ముకాస్తున్న పవన్ కల్యాణ్‌ను సీమలో తిరగనిచ్చేది లేదని కుంచం హెచ్చరించారు. గతంలో చిరంజీవి ఇలానే పోటీ చేసి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని.. ఇప్పుడు పవన్ న్యాయం చేస్తాడనే ఆలోచన లేదని ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి