సినీ హీరో నందమూరి హరికృష్ణ చనిపోవడానికి ప్రధాన కారణం సీటు బెల్టు పెట్టుకోక పోవడమేనని హరికృష్ణతో పాటు కారులో ప్రయాణించి ప్రాణాలతో బయటపడిన మిత్రుడు శివాజీ తెలిపారు. బుధవారం వేకువజామున నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద కారు బోల్తా పడటంతో ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇద్దరు స్నేహితులు అరికపూడి శివాజీ, వెంకట్రావులు కారులోనే ఉన్నారు. ఈ ప్రమాదంలో వీరిద్దరూ గాయాలతో బయటపడగా, హరికృష్ణ మాత్రం ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంపై అరికపూడి శివాజీ స్పందించారు. నెల్లూరు జిల్లా కావలిలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు తామంతా ఉదయం 4.30 గంటలకు కారులో బయలుదేరామని శివాజీ తెలిపారు. హరి పక్కన తాను కూర్చుకున్నానని వెనుక సీట్లో వెంకట్రావు ఉన్నాడని వెల్లడించారు. కారు వేగంగా వెళుతుండగా రోడ్డుపై ఉన్న రాయిపైకి కారు ఎక్కిందనీ, దీంతో వాహనం అదుపు తప్పిందని వెల్లడించారు. ఈ సందర్భంగా హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా ఎరిగి బయటపడ్డారనీ, సీటు బెల్టు పెట్టుకోవడంతో తామిద్దరం ప్రాణాలతో బయటపడ్డామని వెల్లడించారు.
అయితే, ప్రత్యక్ష సాక్షి మాత్రం మరోలా చెబుతున్నారు. హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో వస్తూ, ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి, గాల్లోకి ఎగిరి, డివైడర్‌ను దాటి, హైదరాబాద్ వైపు వస్తున్న మరో కారును ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఆ కారులోని నలుగురిలో ఓ వ్యక్తికి గాయాలు కాగా, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. అదే కారులోని మరో వ్యక్తి, ప్రమాదంపై తనకు తెలిసిన విషయాలను మీడియాతో పంచుకున్నాడు.
తమది హైదరాబాద్ అని, ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నట్టు చెప్పాడు. పని ముగించుకుని ఐదుగురం కారులో హైదరాబాద్ వైపు వస్తున్నాం. ఉదయం ఆరు గంటలు ... ఆపోజిట్ రోడ్డు నుంచి వస్తున్న కారు, డివైడర్‌ను దాటి ఎగిరి మా కారుపై పడింది. అప్పటికే మేము ప్రయాణించే కారు వంద కిలోమీటర్ వేగంలో ఉంది. దీంతో మాకారు సాధారణంగానే వస్తోంది. ఒక్కసారి ఉన్నట్టుండి చెట్ల మధ్య నుంచి కారు దాదాపు 15 అడుగుల ఎత్తు నుంచి మా కారుపైకి పడుతూ కనిపించింది.
నేను దాన్ని చూసి, లెఫ్ట్‌కు కట్ చేశాను. కారు బాడీ రైట్ సైడ్‌కు తగిలింది. నా వెనకాల కూర్చున్న అతనికి దెబ్బలు తగిలాయి. అతనిప్పుడు ఓకే. ఆ కారులో ఉన్నది ఎవరో తెలియదు. మా కారు రోడ్డు దాటి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. మేము డోర్ తీసుకుని బయటకు వచ్చేసరికే చాలా సేపయింది. మా వాళ్లను చూసుకుని వచ్చేసరికే టైమ్ పట్టిందని చెప్పాడు.