హరికృష్ణ మృతి తెదేపాకే కాదు.. రాష్ట్రానికే తీరని లోటు-చంద్రబాబు

బుధవారం, 29 ఆగస్టు 2018 (11:02 IST)
ప్రముఖ నటుడు, రాజకీయ నేత హరికృష్ణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి తీరని లోటు అని  చంద్రబాబు వ్యాఖ్యానించారు. హరికృష్ణ ప్రమాద వార్త వినగానే చంద్రబాబు హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆసుపత్రికి బయల్దేరారు. 
 
ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటనాస్థలానికి వెళ్లాలని, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించినా ఆయన్ను కాపాడుకోలేకపోయామని సీఎం ఆవేదన చెందారు. 
 
హరికృష్ణ మృతి తెదేపాకే కాదు, రాష్ట్రానికే తీరని లోటు అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. చలనచిత్ర రంగానికి, రాజకీయ రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. నందమూరి తారకరామారావుకు ఆయన అత్యంత ఇష్టమైన వ్యక్తి హరికృష్ణ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
 
తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ హఠాన్మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటిస్తున్నారు. నందమూరి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మోహన్‌బాబు, సుమన్‌, శివాజీరాజా, బాబూమోహన్‌, సుధీర్‌బాబు, అల్లరి నరేశ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, గోపీచంద్‌ మలినేని, మంచు లక్ష్మీ, మనోజ్‌, దేవిశ్రీప్రసాద్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.
 
హరికృష్ణ తనకు సోదరుడిలాంటి వారని సుమన్‌ అన్నారు. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో హరికృష్ణతో కలిసి నటించిన సమయంలో ఆయనతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు