ఆర్కే బీచ్‌లో ఆత్మగౌరవ నిరసన: మార్చిలో అంటున్న పవన్

శనివారం, 28 జనవరి 2017 (05:52 IST)
ప్రత్యేక హోదాపై కేంద్ర నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆర్కే బీచ్‌కు వెళుతున్న వందలాది మంది విద్యార్థులు ఏపీ పోలీసులు అరెస్టు చేయడం వారి ప్రాథమిక హక్కులకే భంగకరం అని వ్యాఖ్యానించిన సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దానికి నిరసనగా మార్చి నెలలో అదే ఆర్కే బీచ్‌లో దక్షిణ బారతీయుల ఆత్మగౌరవ శాంతియుత నిరసనను నిర్వహిస్తానని ప్రకటించడం వింతగొలుపుతోంది. 
 
ఆర్కే బీచ్‌లో సునామీ సృష్టిస్తాను అన్న చందంలో వీర ట్వీట్‌లు సంధించి తీరా జనవరి 26న హైదరాబాద్‍‌లో షూటింగులో ఉండిపోయిన పవన్ కల్యాణ్ విద్యార్ధుల అరెస్టుకు నిరసనగా మార్చి నెలలో దీక్ష పూనుతానని  ప్రకటించడం చాలామందిని షాక్‌కు గురి చేసింది. పెళ్లయిన ఆరునెలలకు దొంగలు పడ్డట్టుగా అరెస్టయిన విద్యార్థులకు మద్దతుగా నెలరోజుల తర్వాత ఆర్కే బీచ్‌లో నిరసన దీక్ష చేయడం ఏమిటన్నది ప్రశ్నార్థక మవుతోంది.
 
పైగా ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ర్యాలీలను ఉక్కుపాదంతో అణిచివేస్తే కేంద్రం దక్షిణాది ప్రజలను అణచివేస్తోందంటూ కేంద్రాన్ని టార్గెట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలేయడం అనుమానాలు రేకెత్తిస్తోంది.
 

వెబ్దునియా పై చదవండి