మీ పిల్లలు ఏ పాఠశాలలో చదవుతున్నారు?: జగన్‌ సవాలు

సోమవారం, 11 నవంబరు 2019 (19:13 IST)
"ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు పవన్‌కల్యాన్‌ వంటి వారు చాలా దారుణంగా మాట్లాడారు. పేదవాడికి ఇంగ్లీషు మీడియం ఎందుకని చులకన చేశారు. ఈ సందర్భంగా వారందరికి నేను సవాలు విసురుతున్నా.. చంద్రబాబు కుమారుడు, మనవడు ఏ మీడియంలో చదువుతున్నారు?. పవన్‌ కల్యాన్‌ కుమారులు ఏ మీడియంలో చదువుతున్నారు?" అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవాలు విసిరారు.

దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. విజయవాడలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. అబుల్‌ కలాం జయంతిని 2008లో మైనార్టీ వెల్ఫేర్ డేగా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారికంగా నిర్వహించారని గుర్తుచేశారు.

విద్యాసంస్థల అభివృద్ధి కోసం అబుల్‌ కలాం ఆజాద్‌ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. 1947 నుంచి 1958 వరకు మౌలానా విద్యాశాఖ మంత్రిగా విశేష సేవలు అందిచారని కొనియాడారు. అనేక విద్యా సంస్థలను పునాది వేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ.. ప్రజాసంకల్ప యాత్రలో  పేదరికంను, వెనుకబాటును అతి దగ్గరగా చూశానని అన్నారు.

దీనంతటికీ కారణం పిల్లలకు నాణ్యమైన విద్యలేకపోవడమే పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలని, అది ఒక్క ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పేదరికం నుంచి బయటపడాలి అంటే చదువు చాలా ముఖ్యమని, తమ ప్రభుత్వంలో చదువుకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. 
 
మీ పిల్లలు ఏ పాఠశాలలో చదవుతున్నారు..?
‘2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో నిరక్షరాస్యత 33శాతం. దేశంలో 27శాతం ఉంది. దేశ సరాసరి కంటే చాలా వెనుకబడి ఉన్నాం. ఈ దారిద్యం పోవాలి అంటే పిల్లలకి ఉన్నత విద్యను అందించాలి. ఒక దీపం గదికి వెలుగునిస్తే.. చదువుల దీపం కుటుంబానికి, దేశానికి వెలుగునిస్తుంది.

ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలి. అది ఒక్క ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలతోనే సాధ్యం. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఇటీవల ఓ జీవోను విడుదల కూడా చేసింది. కార్యాచరణ కూడా రూపొందించింది. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు పవన్‌కల్యాన్‌ వంటి వారు చాలా దారుణంగా మాట్లాడారు.

పేదవాడికి ఇంగ్లీషు మీడియం ఎందుకని చులకన చేశారు. ఈ సందర్భంగా వారందరికి నేను సవాలు విసురుతున్నా.. చంద్రబాబు కుమారుడు, మనవడు ఏ మీడియంలో చదువుతున్నారు?. పవన్‌ కల్యాన్‌ కుమారులు ఏ మీడియంలో చదువుతున్నారు?. పిల్లల్ని మంచి చదవులు ఇ‍వ్వకపోతే వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది.

పిల్లలకి ఉన్నత చదవులు అందించాలని అనే సంకల్పంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. దానిపై ప్రతిపక్ష నాయకులు బుదరజల్లడం నిజంగా దారుణం. మన పిల్లలకు చదువు చెప్పకపోతే దేశం నష్టపోతుంది. ప్రతి చదువు కోసం ఏ పేదింటిలో కూడా అప్పులపాలు రాకుండా ఉండాలి.

ఆ దిశగా అడుగులు వేస్తునే డిసెంబర్‌ నెలాఖరులో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నవంబరు 14న స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం మార్పు కోసం శ్రీకారం చుడుతున్నాం. నేడు స్కూళ్లు ఎలా ఉన్నాయని చూపిస్తాం. ప్రతి స్కూల్‌లోనూ బాత్‌రూం, నీళ్లు, బ్లాక్‌బోర్డు, పర్నీచర్‌, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఉండాలి. ప్రతి స్కూల్‌కు పెయింటింగ్‌ ఉండాలి.

రేపు సంవత్సరం మొదలు ప్రతి సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్‌ మీడియం చేస్తూ, తెలుగు, ఉర్దూ బాషను తప్పని సరి చేస్తాం. మీడియం మాత్రం ఇంగ్లీష్‌ చేస్తాం. 1 నుంచి 6వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం చేస్తాం. తరువాత సంవత్సరం 7, ఆ తరువాత 8, 9, 10 ఇలా ఏటేటా ఇంగ్లీష్‌ మీడియం చేస్తాం.
 
మదర్సా బోర్డు ఏర్పాటుకు ఆదేశాలు
డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ఇక్కడికి వచ్చే ముందు.. మదర్సాల గురించి ఆలోచించాలని కోరారు. ఇందుకోసం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రికి ఆదేశాలు జారీ చేస్తున్నాం.

అక్కడి పిల్లలకు కూడా మోడ్రన్‌ ఎడ్యుకేషన్‌ తీసుకురావాలి. ఉర్దూ, ఖురాన్‌లో రాణిస్తునే మరో వైపు ఇంగ్లీష్‌ చదువులు చదివేలా రెండు బ్యాలెన్స్‌ చేస్తూ అమ్మ ఒడి పథకాన్ని వాళ్ల వద్దకు కూడా తీసుకువెళ్తాం. 
 
మార్చి నుంచి వైయస్‌ఆర్‌ పెళ్లి కానుక
గతంలో పెళ్లి కానుక చంద్రబాబు పెట్టారు. ఈ పథకం ఆగిపోయింది. నవంబర్‌ 2018 నుంచి ఈ పథకం తెరమరుగు అయ్యింది. చంద్రబాబు పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. కొంచెం టైం ఇస్తే మార్చిలో వైయస్‌ఆర్‌ పెళ్లి కానుక తీసుకువస్తాం.

గతంలో చంద్రబాబు ఇచ్చిన దానికంటే వైయస్‌ఆర్‌ పెళ్లి కానుక రెట్టింపు చేస్తూ రూ.1 లక్ష ఇస్తాం. మౌజమ్‌, మౌలానాలకు గౌరవవేతనాలు పెంచి ఇస్తాం. దీనికి కొంచెం సమయం ఇవ్వమని కోరుతున్నాను. మసీదుల సంఖ్య పెంచుతాం. ఇస్తామన్న రూ.15 వేలు ఇచ్చి తీరుతామని తెలియజేస్తున్నా. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు