పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదానికి ఎందుకింత జాప్యం?

గురువారం, 2 డిశెంబరు 2021 (20:11 IST)
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదించడానికి ఎందుకు ఇంత తీవ్ర కాలాయపన జరుగుతోందో తెలియ‌డం లేద‌ని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్య‌నించారు. దీని వల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. 
 
 
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి డ్యాం సేఫ్టీ బిల్లుపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 31 డ్యాంల పునరావాసం కోసం ఖర్చయ్యే 776 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి చేరాయన్నారు. 
 
 
ధవళేశ్వరం, ప్రకాశం, తోటపల్లి డ్యాంలు తదితర ప్రాజెక్టులు చాలా పురాతనమైనవని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. డ్యాం సేఫ్టీ బిల్లు అత్యంత అవసరమని.. అదే విధంగా డ్యాంల డేటాబేసు అందుబాటులో ఉంచాలన్నారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని అన్నారు. రైతులకు న్యాయం జరగాలంటే జలాల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయపరమైన వాటాదక్కాలని ఎంపీ విజయసాయిరెడ్డి వివ‌రించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు