అమ్మను కొట్టాడని నాన్నను పొడిచేసిన కొడుకు...

మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (15:39 IST)
మద్యం సేవించి తల్లిని కొట్టాడని కొడుకు ఆవేశంతో తండ్రిని పొడిచేశాడు. ఈ ఘటన కోదాడ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కోదాడ పట్టణం నయానగర్‌లో గుండెల మల్లయ్య(46) భార్య సామ్రాజ్యంతోపాటు నివాసం ఉంటున్నాడు. వారికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు, కూతురు‌కి వివాహం అయింది. కాగా రెండవ కుమారుడు రామకృష్ణ బీఫార్మసీ పూర్తి చేశాడు. 
 
మల్లయ్యకు మద్యం అలవాటు ఉంది. మద్యం సేవించినప్పుడల్లా భార్యతో ఘర్షణ పడి కొడుతుండేవాడు. ఇదిలా ఉండగా సోమవారం భార్య సామ్రాజ్యం ఖమ్మంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువులను చూసేందుకు వెళ్లింది. మల్లయ్య భార్యకు పదేపదే ఫోన్ చేసి తిరిగి రమ్మని బలవంతపెట్టాడు. భార్య కోదాడకు రాగానే ఆమెను తన అన్న సూర్యనారాయణ ఇంటికి తీసుకువెళ్లాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న మల్లయ్య, భార్య ఘర్షణ పడ్డారు, చేయి చేసుకున్నాడు. 
 
భార్య ఏడుస్తూ ఇంటికి వెళ్లింది. తల్లి దుఃఖాన్ని చూసిన చిన్న కొడుకు నాన్న కొట్టాడా అని ప్రశ్నించాడు. ఆవేశంతో పెదనాన్న ఇంటికి వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న తండ్రితో వాగ్వివాదానికి దిగాడు. ఇద్దరి మధ్య తోపులాట జరగడంతో రామకృష్ణ అవేశంలో కత్తితో తండ్రిని పొడిచాడు. తీవ్ర గాయాలైన తండ్రిని చూసి రామకృష్ణ, పెదనాన్న సూర్య నారాయణ అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కొడుకు ఆవేశంతో వెళ్లేటప్పుడు తల్లి తండ్రితో గొడవపడవద్దని ఎంత వారించినా వినలేదు. మల్లయ్య మృతితో బంధువులు, కొడుకులు, కుమార్తె కన్నీరు మున్నీరు అయ్యారు. సీఐ శ్రీనివాస్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు