అమ్మ అక్రమ సంబంధం, ముక్కుపచ్చలారని కుమార్తెకు నాన్న ఉరి, ఆపై అతడు కూడా...

శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (16:52 IST)
చిత్తూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య అక్రమ సంబంధాన్ని తట్టుకోలేని భర్త తన నాలుగున్నరేళ్ళ కుమార్తెను చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు సింధు లాడ్జిలో ఈ ఘటన జరిగింది.
 
చెన్నైకు చెందిన గణేష్‌కు, చిత్తూరు ప్రశాంత్ నగర్‌కు చెందిన దివ్యకు ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి నాలుగున్నర సంవత్సరాల కార్తీక అనే కుమార్తె ఉంది. బిడ్డను అల్లారుముద్దుగా చూసుకునే వారు. 
 
అయితే దివ్య గత కొన్నిరోజుల నుంచి కొంతమంది వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందని గణేష్‌కు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని బంధువులే చెప్పడంతో షాకయ్యాడు. ఆ తరువాత నిఘా వేసి మరీ అది నిజమని తెలుసుకున్నాడు. దీంతో ఇద్దరూ కలిసి విడాకులు తీసుకుందామనుకున్నారు. 
 
భార్య ప్రవర్తనను తట్టుకోలేక విడాకులు తీసుకుందామనుకున్నాడు. అయితే తన కుమార్తె ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చిత్తూరులోని ఒక ప్రైవేటు లాడ్జిని అద్దెకు తీసుకుని అందులో ఒక ఏడు నిమిషాల సెల్ఫీ వీడియోను చిత్రీకరించాడు.
 
తాను పడుతున్న మనోవేదనను అందులో వివరించాడు. ముందుగా తన కుమార్తెను బాత్రూంలో ఉరి వేసి చంపి ఆ తరువాత తను కూడా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ చావుకు కారణమైన దివ్యతో పాటు తమను ఇబ్బంది పెట్టిన వారందరినీ కఠినంగా శిక్షించాలని పేర్కొన్నాడు. గణేష్, కార్తీక మృతితో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దివ్య ప్రస్తుతం పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు