నందిగాం మండలం మర్లపాడు గ్రామానికి చెందిన బతకల దానయ్య, పంజాబ్ రాష్ట్రం అబోహర్లో హవాలాదార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఐతే కొద్ది నెలల క్రితం ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడటంతో మూడు నెలలుగా కోల్‌కతా ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల (ఆదివారం) క్రితం మరణించాడు. మృతదేహాన్ని సోమవారం స్వగ్రామం మర్లపాడుకు తీసుకువచ్చిన అనంతరం భారీగా ఊరేగింపుగా అంతిమయాత్ర నిర్వహించారు.
ఎప్పుడూ అందరితో సరదాగా ఉండే దానయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున అంతిమయాత్రలో పాల్గొన్నారు. దానయ్య మృతదేహంపై జాతీయజెండాను కప్పి గౌరవ సూచికంగా నేవీ , ఆర్మీ సిబ్బంది మూడుసార్లు గాలిలో కాల్పులు జరిపి వీడ్కోలు పలికారు. ఐతే దానయ్య తండ్రి అనారోగ్యంతో మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్నారు. దానయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నా వారు చిన్నపిల్లలు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వివాహబంధంతో ఏడడుగులు వేసిన దానయ్య భార్య శారద... తన భర్త చితికి నిప్పంటించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా హృదయవిధారకంగా మారింది.