ఇప్పటికే మినీ కోర్‌కమిటీలో స్థానం లేకుండా చేసిన ఎంపీలను, ఇప్పుడు ఢిల్లీ పర్యటనలకూ దూరంగా ఉంచిన వైనంపై ఏపీ బీజేపీ సీనియర్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో తాజాగా జరుగుతున్న ఢిల్లీ పర్యటనలో పార్టీ ఎంపీలు లేకపోవడం విమర్శలకు దారితీసింది. దీనిపై అటు ఎంపీలు సైతం అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్ వ్యవహారంగా మారుతున్నందున, దానిపై కేంద్రం పునరాలోచన చేయాలంటూ సోము ఆధ్వర్యంలోని ఓ ప్రతినిధి బృందం డిల్లీకి వెళ్లింది. ఆమేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మురళీధరన్‌ను కేంద్రమాజీ మంత్రి పురందీశ్వరి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌లు కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఆంధ్రుల మనోభావాలు గౌరవించాలని వారు కోరగా, వారు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. పావుగంటలో వారి భేటీ ముగిసింది. అటు ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌కు ఫోన్ చేసి, విశాఖ అంశాన్ని ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల ఇదే అంశంపై రాష్ట్ర నేతలు నిర్మలా సీతారామన్‌కు కలిసిన సందర్భంలో.. తాను ఏమీ చేయలేనని, ప్రధాని పరిథిలో ఉన్న ఈ అంశంపై తానెలాంటి హామీ ఇవ్వలేనని స్పష్టం చేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో పార్టీకి చెందిన ఎంపీలు సుజనా చౌదరి, జీవీఎల్, సీఎం రమేష్, టిజి వెంకటేష్‌ను దూరంగా ఉండటం చర్చనీయాంశమయింది. సహజంగా కేంద్రమంత్రుల వద్దకు వెళ్లే సందర్భాల్లో ఆయా పార్టీల ఎంపీలను, రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకత్వాలు తమ వెంట తీసుకువెళుతుంటాయి.
కానీ, సోము వీర్రాజు మాత్రం.. అసలు వారికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా, ఎంపిక చేసుకున్న కొద్దిమంది రాష్ట్ర నేతలను తీసుకువెళ్లడం విమర్శలకు దారితీస్తోంది. చివరకు ఢిల్లీలో జరిగే రాష్ట్ర నేతల పర్యటనలకు దిశానిర్దేశం చేసే, ఎంపీ జీవీఎల్ కూడా కనిపించకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.