కట్నం కోసం నిండు గర్భిణిని కాల్చేశారు.. మృగంలా మారిన భర్త...

గురువారం, 20 ఏప్రియల్ 2017 (11:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. కట్నం కోసం నిండు గర్భిణిని కాల్చేశాడు. ఈ దారుణానికి కట్టుకున్న భర్తే మృగంలా మారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నిజామాబాద్‌లోని నిజాం కాలనీకి చెందిన ఎస్‌కే ముజీబ్‌ఖాన్‌కు ఏడాది క్రితం నిర్మల్‌ జిల్లా కొల్లూర్‌కు చెందిన సనా బేగం (23)తో వివాహమైంది. ఆటో నడుపుతూ జీవించే ముజీబ్‌ కొద్ది రోజులుగా భార్యను అదనపు కట్నం కోసం వేధించటం ప్రారంభించాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం అర్థరాత్రి నిద్రిస్తున్న సనాపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి