కేదార్నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు.. తొలి రోజే రికార్డు స్థాయిలో...

ఠాగూర్

శనివారం, 3 మే 2025 (11:00 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ తలపులు శుక్రవారం నుంచి తెరుచుకోవడంతో స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులు తొలిరోజే పోటెత్తారు. రికార్డు స్థాయిలో 30 వేల మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి 7 గంటల వరకు అధికారిక గణాంకాల ప్రకారం 30 వేల మందికి పైగా భక్తులు కేదారనాథుడుని దర్శనం చేసుకున్నారు. వీరిలో 19196 మంది పురుషులు, 10597 మంది మహిళలు, 361 మంది ఇతరులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. 
 
కాగా, శుక్రవారం కేదార్నాథ్ ఆలయ తలపులు తెరిచిన విషయం తెల్సిందే. దీంతో చార్‌ధామ్ యాత్ర మొదలైనట్టయింది. ఈ సందర్భంగా భారత సైన్యానికి చెందిన గర్హ్వాల్ రైఫిల్స్ బృందం భక్తి గీతాలను వాయించింది. అలాగే, ధామ్ పోర్టరల్ ప్రారంభోత్సవానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా హాజరయ్యారు. కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముఖ్య సేవక్ భండారాలో భక్తులకు ముఖ్యమంత్రి ప్రసాదం పంపిణీ చేశారు. మే 4వ తేదీన బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. 
 
కాగా, కేదార్నాథ్ ఆలయం పునర్నిర్మాణ పనుల కోసం రూ.2 వేల కోట్లు కేటాయించినట్టు సీఎం ధామి ప్రకటించారు. అలాగే, గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వరకు రోప్‌వే ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు