రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైసీపీ ప్రభుత్వం: తులసి రెడ్డి

శుక్రవారం, 1 అక్టోబరు 2021 (22:33 IST)
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎన్. తులసి రెడ్డి  ధ్వజమెత్తారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సమీర్ శర్మకు ఆర్ధిక వనరుల సమీకరణే ఛాలెంజ్ అని హితబోధ చేయడాన్ని చూస్తే రాష్ట్ర ఖజానా పరిస్థితికి అడ్డం పడుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా అసలు, వడ్డీల కోసం రూ. 4000 కోట్లు, జీతాలు, ఫించన్ల కోసం రూ. 5,600 కోట్లు, వృద్ధాప్య పింఛన్ల కోసం రూ. 1400 కోట్లు, విద్యుత్ బాండ్ల కోసం రూ.500 కోట్లు, నవరత్నాల పధకాల అమలు కోసం రూ. 5,800 కోట్లు కావాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా రూ. 16,700 కోట్లు అవసరం కాగా రాబడి మాత్రం రూ. 10 వేల కోట్లు మాత్రమే కావడంతో అప్పులు చేయాల్సి వస్తోందని తులసి రెడ్డి వివరించారు.

శుక్రవారం ఆంధ్ర రత్న భవన్ నుంచి ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్ధిక వనరుల సమీకరణే ప్రధానమని ఆదిత్యనాధ్ దాస్ స్పష్టం చేసారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎన్. తులసి రెడ్డి అన్నారు.

1956 నుంచి 2014 వరకు గత ప్రభుత్వాలు లక్ష కోట్లు అప్పు చేయగా , 2014-19 వరకు ఉన్న ప్రభుత్వం అయిదు సంవత్సరాల్లో రూ. 1.60 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ రెండు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం రూ. 2.63 లక్షల కోట్లు అప్పు చేసిందని వివరించారు. ఇన్ని అప్పులు చేస్తున్నా సంక్షేమ పధకాల్లో పేదలకు కోత పెట్టడం ఎంత  వరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు