తన రాజీనామాకు అనేక కారణాలు ఉన్నాయని వైకాపా రాజ్యసభ సభ్యత్వంతో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వైకాపా నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఆయన గురువారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే, వైకాపాకు కూడా. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, తన రాజీనామాలకు అనేక కారణాలు ఉన్నాయన్నారు. చాలా రోజుల పాటు ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
గెలుపైనా, ఓటమైనా స్థానిక రాజకీయాల్లో ఉండటమే తనకు ఇష్టమన్నారు. రాజ్యసభకు రావడం తనకు సుతరామా ఇష్టం లేదన్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. టీడీపీలో తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. తాను పదవుల కోసం పార్టీ మారడం లేదన్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం తాను చాలా త్యాగాలు చేసినట్టు ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
అలాగే, వైకాపాకు చెందిన మరో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే వైకాపాకు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించానని తెలిపారు. ఇప్పటివరకు సహకరించిన వైకాపా అధినేతకు, ఆ పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెపుతున్నట్టు తెలిపారు.