పిల్ల చేష్ట‌లు వ‌ద్దు, రాజ‌ధాని ఏదో చెప్ప‌లేని దుస్థితి మీది...

శుక్రవారం, 16 జులై 2021 (16:24 IST)
జ‌ల వివాదంలో ఏపీ ప్ర‌భుత్వం పిల్ల చేష్ట‌లు చేస్తోంద‌ని తెలంగాణా మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి విమ‌ర్శించారు. ప్రాజెక్టుల వ‌ద్ద భ‌ద్ర‌త పెట్టాల‌ని కేంద్రానికి లేఖ రాయ‌డం ఏమిట‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకున్న జల వివాదాలపై నేతలు ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటున్నారు. అటు టీఆర్ఎస్, ఇటు వైఎస్ఆర్సీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదానికి ఏపీ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలను ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడం పిల్ల చేష్టలకు నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు.
 
కృష్ణా జలాలపై నీటి వాటా తేల్చాలని తామూ సర్వోన్నత న్యాయస్థానాన్ని అడుగుతున్నామని తెలిపారు. విజ్ఞతతో వ్యవహరిస్తే సమస్యలు సామరస్యంగా పరిష్కారమవుతాయని మంత్రి సూచించారు. కుట్రపూరితంగా తెలంగాణ రాకుండా చేయాలని చూసిన ఆంధ్రప్రదేశ్‌ పాలకులు... ఇపుడు తమ రాజధాని కేంద్రం ఏదో చెప్పలేని స్థాయికి దిగజారారని దుయ్యబట్టారు. దేశానికి దిక్సూచిలా తెలంగాణ మారిందని అన్నారు.
 
అయితే, ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతోనే పహారా నిర్వహించనున్నట్టు కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం కోరినట్టే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్‌ల వద్ద కేంద్ర బలగాలు గస్తీ నిర్వహిస్తాయి. గోదావరి బేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టులు లేనందున పెద్దగా ప్రాధాన్యం లేదు. కృష్ణా బేసిన్‌లో మాత్రం పరిస్థితి భిన్నం. ప్రస్తుతం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌ నిర్వహణలోనూ, నాగార్జునసాగర్‌ తెలంగాణ నిర్వహణలోనూ ఉన్నాయి. ఇవన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలోకి వస్తాయి. అక్క‌డ కేంద్ర బ‌ల‌గాలే భ‌ద్ర‌త క‌ల్పించ‌నున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు