వైకాపా నేతలకు బెదిరింపులు - భద్రత పెంపు

బుధవారం, 24 నవంబరు 2021 (14:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైకాపా నేతలకు బెదిరింపులు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. 
 
ఇటీవల అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి వైకాపా మంత్రులు అసభ్యంగా మాట్లాడారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.
 
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, నేతలు ఆందోళనకు దిగి నిరసనలు తెలుపుతున్నారు. అదేసమయంలో సోషల్ మీడియా వేదికగా వారికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. 
 
ఈ క్రమంలో మంత్రి కొడాలి నానికి ప్రస్తుతం ఉన్న 2+2 గన్‌మెన్లతో పాటు అదనంగా 1+4 గన్‌మెన్ల భద్రతను ప్రభుత్వం అదనంగా కేటాయించింది. అంతేకాకుండా అదనంగా మరో భద్రతా వాహనాన్ని కూడా ప్రభుత్వం సమకూర్చింది. దీంతో 7+7 భద్రతగా ఉండనుంది.
 
అలాగే, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలకు కూడా ప్రస్తుతం ఉన్న 1+1 భద్రతకు అదనంగా 3+3 భద్రతగా పెంచింది. అంటే ఇకపై వీరికి 4+4 భద్రతగా ఉంటుంది. చంద్రబాబుపై వ్యాఖ్యలు అనంతరం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన బెదిరింపులను సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు