నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు. ముఖ్యంగా, పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు తాము శ్రీకారం చుట్టబోతున్నామని ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రతీగ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సచివాలయంలో దాదాపు 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఎన్నికలకు ముందు తమ పార్టీ తరపున ప్రకటించిన నవరత్నాల అమలుపై తొలి అడుగు వేశారు. ఈ నవరత్నాల జాబితాలో పేర్కొన్న వృద్ధాప్యం పెన్షన్లను రూ.3 వేలకు పెంచారు. అయితే దీన్ని దశలవారీగా అమలు చేయనున్నారు. వచ్చే జూన్ నెల నుంచి ప్రస్తుతం ఇస్తున్న రూ.2 వేల పింఛన్‌ను రూ.2250కు పెంచారు. ఆ తర్వాత రెండో యేడాది ఈ మొత్తాన్ని రూ.2500కు, మూడో యేడాది రూ.2750కు, నాలుగో యేడాది రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీరు చొప్పున నెలకు రూ.5 వేల జీతానికి నియమిస్తామని తెలిపారు. ఈ గ్రామ సచివాలయంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఈ కార్యాలయాల ద్వారానే రేషన్ కార్డు, వైఎస్ఆర్ పించన్లు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్, ఇలా ఏది కావాలన్నా ఒక్క పైసా లంచం లేకుండా దరఖాస్తు చేసుకుంటే 72 గంటల్లో మీ దరఖాస్తును ఆమోదిస్తామని తెలిపారు.