వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ప్లీనరీలో జగన్ ప్రకటించిన తొమ్మిది అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వైకాపా రంగం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా 'వైఎస్సార్ గుర్తుగా - జగన్‌కు తోడుగా' అనే పేరుతో 60 రోజుల కార్యాచరణను ప్రశాంత్ కిషోర్ రూపొందించారు. అందులో భాగంగా మొదటి విడతలో నవరత్నాల సభలు, ఆ తర్వాత వైఎస్సార్ కుటుంబం విజయ శంఖరావం పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
కానీ ఇప్పటివరకు నవరత్నాల సభలను వైకాపా నేతలు పూర్తి చేయకపోవడంతో ఈ సభల నిర్వహణ విషయంలో బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జగన్ వద్ద పార్టీ నేతల నిర్లక్ష్య వైఖరిపై ప్రశాంత్ కిషోర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అనుకున్న లక్ష్యాలు సాధించలేమని పీకే నొక్కి చెప్పినట్లు సమాచారం. ఇప్పటికైనా వీలైనంత త్వరగా నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించాలని జగన్‌కు పీకే సూచించినట్లు తెలుస్తోంది.