విషపు నాగులను కాదు.. అనకొండను అరెస్టు చేయాలి : వైఎస్ షర్మిల (Video)

ఠాగూర్

మంగళవారం, 12 నవంబరు 2024 (19:22 IST)
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని విపక్ష నేతలపై సభ్య తలదించుకునేలా అసభ్య పదజాలంతో పోస్టులు చేసిన కేసుల్లో అరెస్టు చేయాల్సింది విషపు నాగులను కాదనీ అనకొండను అరెస్టు చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనితలతో పాటు వారి కుటుంబ సభ్యులు, తనను, తనతల్లి విజయమ్మ, సోదరి వైఎస్ సునీతలను లక్ష్యంగా చేసుకుని అసభ్య పోస్టులు పెట్టినందుకు వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై షర్మిల స్పందించారు. 
 
తాను కూడా సోషల్ మీడియాలో బాధితురాలినేనని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల ద్వారా తనపై ప్రచారం వెనుక ఉన్నది జగనే అని స్పష్టం చేశారు. నాపై దుష్ప్రచారం జరుగుతుంటే ఆయన ఆపలేదు... దానర్థం ఏమిటి? ఆ అసభ్యకర ప్రచారాన్ని ఒకరకంగా ఆయన ప్రోత్సహించినట్టే కదా! అని షర్మిల వ్యాఖ్యానించారు.
 
జగన్ వద్దు అని చెప్పి ఉంటే ఆ ప్రచారం అప్పుడే ఆగిపోయి ఉండేదన్నారు. కానీ, ఆయన అలా చేయకుండా ఎంజాయ్ చేస్తూ ఉండిపోయారన్నారు. వైసీపీ సోషల్ మీడియా ఓ సైతాన్ ఆర్మీలా తయారైందని మండిపడ్డారు. వాళ్లకు వ్యతిరేకంగా ఉండేవారిపై సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలు రాజకీయాల్లో కొనసాగాలంటే భయపడే పరిస్థితి తెచ్చారని ఆవేదన వెలిబుచ్చారు.
 
ఇప్పుడు పట్టుబడినవాళ్లంతా వాళ్లంతా విషనాగులేనని, ఆ సోషల్ మీడియా విషనాగులతో పాటు అనకొండను కూడా అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని షర్మిల ఉద్ఘాటించారు. ఇక, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లను అనడం జగన్ అహంకారానికి నిదర్శనమన్నారు. జగన్‌కు ఒకప్పుడు 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు, ఇప్పుడు 11 స్థానాలకే పరిమితం చేశారని, జగన్ అక్రమాలు, అవినీతిని ప్రజలు గమనించారని షర్మిల వివరించారు. 
 
ప్రజల తీర్పుపై జగన్‌కు ఏమాత్రం గౌరవం లేదన్నారు. అసెంబ్లీకి గైర్హాజరవడం ద్వారా వైసీపీ ఎమ్మెల్యేల అజ్ఞానం ఏంటో బయటపడిందని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు, అసెంబ్లీకి వెళ్లబోమని చెప్పి ఓట్లు అడిగారా? అని నిలదీశారు. మీకు సత్తా లేకపోతే రాజీనామా చేయండి అంటూ డిమాండ్ చేశారు.
 

"#YSJagan ఒక సైతాన్ సైన్యాన్ని సృష్టించాడు Social Media లో, తల్లి అని లేదు చెల్లి అని లేదు, ఇప్పుడు పట్టుకుంది కేవలం విష నాగులనే అనకొండ ని పట్టుకోవాలి" - #YSSharmila pic.twitter.com/YktTLgesYE

— Daily Culture (@DailyCultureYT) November 12, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు