ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్న వైఎస్ షర్మిల

వరుణ్

శుక్రవారం, 19 జనవరి 2024 (14:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల తొలిసారి రాష్ట్రంలో పర్యటించనుంది. రెండు రోజుల పాటు ఆమె రాష్ట్రంలో పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20, 21వ తేదీల్లో ఆమె పర్యటన కొనసాగనుంది. ఇందుకోసం ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె కడపకు చేరుకుంటారు. 
 
అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని... సాయంత్రం 4 గంటలకు తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆరోజు రాత్రి అక్కడే బస చేస్తారు. 21వ తేదీ ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు విజయవాడలో పీసీసీ చీఫ్‌గా ఆమె బాధ్యతలను స్వీకరిస్తారు.
 
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలకు పార్టీ హైకమాండ్ ఏపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన విషయం తెల్సిందే. ఇప్పటివరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న గిడుగు రుద్రరాజుకు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో షర్మిల... తొలిసారి రాష్ట్ర పర్యటనకు రానుండటం ప్రత్యేకత సాధించుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు