ప్రశ్నించడానికే జనసేన పుట్టిందా? మరెందుకు సైలెంట్.. ప్రతిసారీ గుర్తుచేయాలా?:దుర్గేష్

మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (16:15 IST)
ప్రశ్నించడానికే జనసేన పుట్టిందని చెప్పుకుంటున్న ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినా నోరు మెదపరా అంటూ వైకాపా నేత కందుల దుర్గేష్ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవడం దారుణమని దుర్గేష్ వ్యాఖ్యానించారు. ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని దుర్గేష్ అడిగారు. 
 
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఇచ్చినందుకు గాను ప్రభుత్వం తీసుకునే ప్రతీ చర్యకు పవన్ కల్యాణ్ బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారికి మంత్రి పదవి ఇవ్వడం ఏమిటని దుర్గేష్ నిలదీశారు. ప్రతీసారీ పవన్ కల్యాణ్‌ను టీడీపీ సర్కారును ప్రశ్నించండి అంటూ.. మనం గుర్తు చేయాలా?అని దుర్గేష్ అడిగారు. 
 
వైకాపా నుంచి గెలుచుకుని తెలుగుదేశం పార్టీలోకి చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు మంత్రిపదవులు కట్టబెట్టిన నేపథ్యంలో.. ఫిరాయింపు చట్టాలని మరింత కఠినతరం చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీనిపై బీజేపీ నేత పురంధేశ్వరి సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బీజేపీ హైకమాండ్‌కు లేఖ రాశారు.
 
ఇప్పటికే మంత్రి పదవి ఆశించి భంగపడిన టీడీపీ సీనియర్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో వైకాపా నేతలను ధీటుగా ఎదుర్కొంటూ.. విమర్శలకు ప్రతి విమర్శలు బుచ్చయ్యను పక్కనబెట్టి.. అదే పార్టీ నుంచి టీడీపీ జంప్ అయిన నేతలకు పట్టం కట్టడంపై ఆయన తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
ఇంకా టీడీపీలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా అసంతృప్తికి గురిచేశాయని.. అందుకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గోరంట్ల బుచ్చయ్యకు మద్దతు తెలుపుతూ.. టీడీపీ నగర అధ్యక్షులు వాసిరెడ్డి రాంబాబు సహా కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు కూడా రాజీనామాలు చేశారు. సీనియర్ నాయకుడైన బుచ్చయ్య రాజీనామా చేయడంతో రాజమండ్రి టిడిపిలో సందిగ్ధత నెలకొంది.

వెబ్దునియా పై చదవండి