గీత దాటితే చర్యలు తప్పవు: ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే రాజాకు పార్టీ హెచ్చరిక

బుధవారం, 29 సెప్టెంబరు 2021 (10:02 IST)
పార్టీని అప్ర‌దిష్ట‌పాలు చేసే ఏ వివాదం లేపినా, చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ యువ‌నేత‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజమహేంద్రవరం వైకాపా నేతల పంచాయితీ జ‌రుగుతోంది. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పిలిపించి సీఎం జగన్‌ మాట్లాడారు. పరస్పరం బహిరంగ ఆరోపణలు చేసుకోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని జగన్‌ స్పష్టం చేసినట్టు తెలిసింది. 
 
అంతకు ముందు తూర్పు గోదావరి జిల్లా పర్యవేక్షకుడు వై.వి.సుబ్బారెడ్డి రెండు విడతలుగా భరత్, జక్కంపూడి రాజాతో భేటీ అయ్యారు. ఇద్దరితో విడివిడిగా మాట్లాడి సుబ్బారెడ్డి వివరణ తీసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి ఈ పంచాయితీ కొనసాగింది. ఇవాళ్టి సమావేశంపై రేపు మీడియాతో మాట్లాడతానని ఎంపీ భరత్‌ తెలిపారు. 
 
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉండగా, కొందరు రైతులతో రాజమహేంద్రవరంలో బ్యాంకు ఖాతాలు తెరిపించి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడే ప్రయత్నాలు చేశారని ఎంపీ భరత్‌పై జక్కంపూడి రాజా ఇటీవల పరోక్ష విమర్శలు గుప్పించారు. దీనిపై ఎంపీ భరత్‌ మాట్లాడుతూ,  చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసుని తనపై అభియోగాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఘాటుగా స్పందించారు. ఈ రకంగా ఇద్ద‌రు యువ‌నేత‌లు ప‌రస్ప‌రం ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం, పార్టీకి న‌ష్టం క‌లిగిస్తోంద‌ని అధిష్ఠానం భావిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు