వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తనకు వార్నింగ్ ఇచ్చారని, దాంతో మనస్తాపానికి గురై పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీలో జంప్ అవుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై వైకాపా ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. తాను జీవితాంతం తాను వైసీపీలోనే వుంటానని రోజా స్పష్టం చేశారు. వైకాపా చీఫ్ జగన్ తనను సోదరి అని చెప్పుకుంటున్నారని రోజా తెలిపారు. జనసేననే కాదు.. తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయని చెప్పారు.
పనికిమాలిన తెలుగుదేశం, జనసేనలోకి వెళ్లే అవసరం తనకు పట్టలేదన్నారు. తనకు తల్లిదండ్రులు లేకపోయినే తనకు రక్షణ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి వుంటానని రోజా అన్నారు. ఒకసారి కూడా తనకు ఫోన్ చేసి నిర్ధారించుకోకుండా తాను జనసేనలోకి వెళుతున్నానని రాస్తే ఆ పత్రికలకు గౌరవంగా ఉంటుందా? అని ఆమె ప్రశ్నించారు.
కొన్ని పత్రికలు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు. పనికిమాలిన వారే అటువంటి రాతలు రాస్తున్నారని అన్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం మోదీని జగన్ కలిసి మాట్లాడితే, కేసుల కొట్టివేత కోసం మాట్లాడారని కొన్ని పత్రికల్లో రాశారని మండిపడ్డారు. నిజంగా వాళ్లకి విలువలున్నాయా? అని ప్రశ్నించారు. తలాతోకా లేని జనసేన, పనికి మాలిన టీడీపీలోకి వెళ్ళాల్సిన కర్మ తనకు పట్టలేదన్నారు.