ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన తప్పదా? వైకాపా ఎంపీ ఏమంటున్నారు?

శనివారం, 25 జులై 2020 (10:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టులతో ఆటలాడొద్దంటూ సొంత పార్టీ పాలకులను హెచ్చరించారు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే రాష్ట్రపతి పాలన తప్పదంటూ జోస్యం చెప్పారు. 
 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వ్యవహారంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కార విచారణను నిలిపివేయాలన్న జగన్‌ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. దీనిపై రఘురామరాజు మీడియాతో మాట్లాడారు. 
 
'రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలను తృణీకరిస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరించి, రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన కొని తెచ్చుకోకండి' అని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు కలిగిన సందర్భంలోనే కాకుండా. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలను బేఖాతరు చేసి.. రాజ్యాంగ సంక్షోభం సృష్టించినప్పుడూ 356 అధికరణ అమల్లోకి వచ్చే అవకాశముందని హెచ్చరించారు. 
 
'సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్న ముఖ్యమంత్రే న్యాయస్థానాల తీర్పులను ఉల్లంఘించి, అవహేళన చేస్తుంటే.. ప్రజలు కూడా వాటిని గౌరవించే పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఇలాంటి రాజ్యాంగేతర, అప్రజాస్వామిక, న్యాయవ్యతిరేక పరిస్థితులకు తావివ్వకూడదు' అని సూచించారు. 
 
'రాజ్యాంగ వ్యవస్థలు, న్యాయవ్యవస్థలపై మా ప్రభుత్వం చేస్తున్న ఈ దాడి మంచిదికాదు. కనీసం ఇకనుంచైనా, మనసు మార్చుకోండి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగంపైనే ప్రమాణం చేశారు. నేను కూడా ఎంపీగా రాజ్యాంగంపైనే ప్రమాణం చేశాను. కనుక రాజ్యాంగ విలువలకు కట్టుబడదాం. సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లొద్దు' అని సీఎం జగన్‌కు ఆయన హితవు పలికారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు