నిజానికి గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానానికి, రఘురామకృష్ణం రాజుకు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ప్రభుత్వం నిర్ణయాలను ఆయన బాహాటంగానే తప్పుబడుతూ వస్తున్నారు. ముఖ్యంగా, అమరావతి అంశంపై ప్రభుత్వంతో పాటు.. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని ఆయన నిలదీస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా సభలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై వైసీపీ ఎంపీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం జరగాల్సిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు రావాలంటూ ఎంపీకి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందింది. అంతలోనే రావొద్దంటూ ఏపీ భవన్ ఉద్యోగి నుంచి ఫోన్ వచ్చింది.
దీనిపై స్పందించిన ఎంపీ తనకు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారాలపై ఎంపీ రఘురామ రాజు మీడియాతో మాట్లాడుతూ.. 'పార్టీ నుంచి బహిష్కరించినట్టు భావిస్తున్నాను. విప్ ఇస్తే పాటించాల్సిన బాధ్యత నాపై ఉంది. పార్టీకి మీకు సంబంధం లేదని చెప్పారు. న్యాయనిపుణులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. మీలోను విద్యావంతులు ఉన్నారు కదా. దీనిని ఏవిధంగా భావించాలో ఆ విధంగానే రాసుకోండి' అని చెప్పుకొచ్చారు.
కాగా, ఇటీవల రఘురామరాజు మాట్లాడుతూ, తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని, అయితే, దీన్ని అమరావతికి రెఫరెండంగా భావిస్తారా అంటూ వైకాపా నేతలకు ఆయన బహిరంగ సవాల్ విసరగా, ఏ ఒక్కరూ ఇప్పటివరకు స్పందించలేదు.