పదవులన్నీ మీ కులస్తులకేనా? దమ్ముంటే బహిష్కరించి చూడండి: రఘురామరాజు

మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (16:00 IST)
వైకాపాకు చెందిన అసంతృప్త నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి బహిరంగ  సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మరోమారు వైకాపా అధినాయకత్వంపై విమర్శలు గుప్పించారు.
 
తనపై అనర్హత వేటు వేయాలని ఎంపీ మిథున్ రెడ్డి మళ్లీ కోరుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10ని ఓసారి చదువుకోవాలని తమ పార్టీ ఎంపీలకు సూచిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పనుల గురించి ఏనాడైనా మిథున్ రెడ్డి మాట్లాడాడా? అని రఘురామ ప్రశ్నించారు. 
 
లోక్‌సభా పక్ష నేత ఎన్నిక జరిపితే మిథున్ రెడ్డికి 3 ఓట్లకు మించి రావని స్పష్టం చేశారు. మిథున్ రెడ్డిపై చాలామంది ఎంపీలకు అసంతృప్తి ఉందన్నారు. తనను పార్టీ నుంచి బహిష్కరించినా, పార్లమెంటులో కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశారు. 
 
సవాల్ విసురుతున్నా... కావాలంటే బహిష్కరించి చూడండి అంటూ తీవ్రంగా స్పందించారు. ఎలాగైనా తానే కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతానని తెలిపారు. చట్ట ప్రకారం నాపై అనర్హత వేటు వేయడం మీ వల్ల కాదన్నారు. ఈ కమిటీ ఛైర్మన్ పదవి తన వాక్పటిమ కారణంగా సాధించుకున్నానని ఉద్ఘాటించారు. పదవులన్నీ మీ కులస్తులకేనా? అని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు