వైకాపా రాజ్యసభ అభ్యర్థులు వీరే... ఫలించిన ముఖేష్ రాయబారం - బీదకు భంగపాటు

మంగళవారం, 10 మార్చి 2020 (08:56 IST)
వైకాపా తరపున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. శాసనమండలి రద్దయిన తర్వాత మాజీలుగా మారే మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లనున్నారు. అలాగే.... రాంకీ అధిపతి అయోధ్య రామిరెడ్డికి కూడా అవకాశమిచ్చారు. ఇక... నాలుగో అభ్యర్థిగా పార్టీతో సంబంధం లేని, రిలయన్స్ అధిపతి ముఖేశ్‌ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమళ్‌ ధీరజ్‌లాల్‌ నత్వానీని ఎంపిక చేశారు.
 
ఆయన వైసీపీ తరపునకాకుండా... స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తారు. అంబానీ అభ్యర్థన మేరకే నత్వానీకి రాజ్యసభ స్థానం ఇవ్వాల్సి వచ్చిందని వైసీపీ ముఖ్య నేతలు విజయ సాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సోమవారం అధికారికంగా వెల్లడించారు. నాలుగు స్థానాలు దక్కించుకునేందుకు అవసరమైన బలం వైసీపీకి ఉండటంతో... ఈ నలుగురి ఎన్నిక లాంఛన ప్రాయంగా మారింది.
 
బీద మస్తాన్ రావుకు భంగపాటు
ఇకపోతే, తెలుగుదేశం పార్టీని వీడి వైకాపాలోకి వచ్చిన సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావుకు రాజ్యసభ స్థానం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గట్టి హామీ ఇచ్చారు. కానీ, జగన్ ఈ హామీని నిలబెట్టుకోలేక పోయారు. దీంతో బీద మస్తాన్ రావు భంగపాటుకు గురయ్యారు. 
 
అలాగే, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి తదితరుల పేర్లు కూడా వినిపించాయి. వారికి కూడా జగన్ మొండి చేయి చూపించారు. ఈ ఇద్దరిలో వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం తితిదే బోర్డు పాలక మండలి ఛైర్మన్‌గా ఉంటే, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాత్రం ఎలాంటి పదవి లేకుండా పార్టీలో ఉన్నారు. ఈయన కుమారుడు మేకపాటి గౌతంరెడ్డి మాత్రం రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రిగా ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు