ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడం సంతోషకరమని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, సీఎం జగన్ చెప్పినట్లు మళ్ళీ ఇంకో రూపంలో బిల్లు తేవడం ఆత్మహత్య సదృశ్యమేనని పేర్కొంటున్నారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణం రాజు కూడా మూడు రాజధానుల బిల్లు రద్దుపై స్పందించారు. ఇది అమరావతి రైతుల విజయం అని, ఇది తథ్యం అని తాను ముందే చెప్పానని అన్నారు. ఈ రాజధానుల బిల్లు ఉపసంహరణ వెనుక, రైతుల విజయానికి వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఒక కారణమేనని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి రైతులతో పాటు తాను కూడా రాజధాని అమరావతి కోసం ముడుపు కట్టానని, ఇది కచ్చితంగా రైతుల విజయమే అని ఎంపీ చెప్పుకొచ్చారు.
అయితే, ఇది తాత్కాలికమేనని, మరోసారి సమగ్రంగా బిల్లు తెస్తామన్న సీఎం వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇక ఎలాంటి మెలికలు పెట్టే సాహసం జగన్ చేయలేడని, ఇక నుంచి అయినా రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. జగన్ ఇకపై పిచ్చి నిర్ణయాలు తీసుకోరని అనుకుంటున్నా అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు.
మరోపక్క మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకోవడం హర్షణీయం అని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సాగుతున్న పోరాటానికి ఇది తొలి విజయం అని, అమరావతి రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని ఆయన కోరారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నామని రామకృష్ణ చెప్పారు.