ఆంగ్ల మాధ్యమంలో చదవండి: వసతులు ఏవండీ...?

Sridhar Cholleti

శుక్రవారం, 13 జూన్ 2008 (16:50 IST)
WD
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించింది. నేటి పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ప్రతి విద్యార్థికి ఇంగ్లీషు పరిజ్ఞానం తప్పనిసరి అయినందువల్ల ఆరో తరగతి నుంచే ఇంగ్లీషు మాధ్యమంలో బోధనకు శ్రీకారం చుట్టింది. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంపట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో హుషారుగా తమ పిల్లలను తీసుకుని పాఠశాలలకు వెళ్లినవారు అక్కడి పరిస్థితులు చూసి నిశ్చేష్టులవుతున్నారు. పాఠశాలలో కనీస వసతుల లేమి కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి.

ఉదాహరణకు వరంగల్ జిల్లానే తీసుకుంటే... జిల్లా వ్యాప్తంగా సుమారు 2 వేలకు పైగా పాఠశాలలున్నాయి. వీటిలో చాలామటుకు కనీస సౌకర్యాల లేమితో సతమతమవుతున్నాయి. ఏ క్షణాన పాఠశాల పైకప్పు ఊడి మీద పడతుందో అని పిల్లలు బిక్కుబిక్కుమంటూ చూసేవి ఎన్నో. ఇక గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలలోని పాఠశాలల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

ఒకవైపు తరగతి గదుల గచ్చు పెచ్చుపెచ్చులుగా ఊడిపోయి చీమల పుట్టలతో దర్శనమిస్తుంటే... మరోవైపు తాగునీరు, మరుగుదొడ్డి... వంటి సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు సకాలంలో పాఠ్యపుస్తకాల పంపిణీ కాకపోవటంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్లనే ఈ దుస్థితి తలెత్తిందని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి