ట్వింకిల్ ట్వింకిల్ "పొలిటికల్" స్టార్స్

WD
రాష్ట్రంలో ప్రస్తుతం సినీ గ్లామర్ రాజకీయపు సుడిగాలి తిరుగుతోంది. మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పాలక, ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో సహా మిగిలిన పార్టీలు సైతం సినీ తారలను విరివిగా ఆహ్వానించాయి.

మెగా గ్లామర్ తట్టుకుని నిలబడటానికి టాలీవుడ్ పరిశ్రమలోని నటీనటులు, నిర్మాతలతో సహా ఆయా పార్టీలు పంచుకున్నాయి. చిరంజీవిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని జీవిత దంపతులను రంగంలోకి దింపింది ఆ పార్టీ. రాజశేఖర్ వచ్చీరాని తెలుగు భాషలో చిరంజీవిపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను సంధించుకుంటూ పోతున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, నందమూరి సెంటిమెంటును మరోసారి చంద్రబాబు వినియోగించుకుంటున్నారు. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ "ఎన్టీఆర్ వెన్నుపోటు" ప్రధాన అస్త్రంగా చేయడంతో అప్పట్లో నందమూరి కుటుంబం ఆయనకు మద్దతు తెలుపలేకపోయింది. అయితే ఈసారి అత్యంత చాకచక్యంగా నందమూరి వంశీయులనందరినీ పర్యటల్లో పాల్గొనేటట్లు చేయగలిగారు చంద్రబాబు.

ప్రజారాజ్యం విషయానికి వస్తే, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన నాటి నుంచి ఆయనపై ప్రత్యేకించి ఎన్నో విమర్శనా బాణాలు సంధించబడుతూనే ఉన్నాయి. వీటన్నిటినీ ఎదురీదుతూ తమ్ముళ్లు, కొడుకు, మేనల్లుడు సహాయంతో తన రైలు బండిని రాష్ట్రంలో తిప్పుతున్నారు మెగాస్టార్.

ఇదిలా ఉంటే నటులను పర్యటనలకే పరిమితం చేయకుండా ఆయా పార్టీలు తమ అభ్యర్థులుగా రంగంలోకి దింపాయి. ఇలా సినీ పరిశ్రమ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగినవారు 17 మంది దాకా ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి జయసుధ పోటీ చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ తరపున మురళీమోహన్, చిత్ర నిర్మాత ఎన్. సూర్యప్రకాశరావు, హాస్య నటుడు బాబూ మోహన్, నటి రోజా, నిర్మాతలు అంబికా కృష్ణ, సునీల్, చెంగల వెంకట్రావు, కొడాలి నాని, మాగంటి బాబు, వంశీ మోహన కృష్ణ బరిలో ఉన్నారు.

ప్రజారాజ్యం విషయానికి వస్తే, మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, నటుడు కృష్ణంరాజు, పోసాని కృష్ణ మురళి రంగంలో ఉన్నారు. తెలంగాణా రాష్ట్ర సమితి నుంచి విజయశాంతి పోటీ చేయగా, లోక్ సత్తా నుంచి నరసింహరావు బరిలోకి దిగారు.

ఎంతమంది తారలు రాజకీయాల్లోకి దిగివచ్చినా, విజయలక్ష్మి చూపు ఏదో ఒక పార్టీపైనే ప్రసరిస్తుంది. ఆ పార్టీ ఏదో తెలియాలంటే మరో నెలరోజులు ఓపిక పట్టాల్సిందే మరి.

వెబ్దునియా పై చదవండి