ముగిసిన ప్రజారాజ్యం పార్టీ సమీక్షలు

FileFILE
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చేపట్టిన ఎంపీ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీ సమీక్షా సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. రోజుకు మూడు జిల్లాల చొప్పున పోలింగ్‌ సరళి, పార్టీ గెలుపు అవకాశాలపై అభ్యర్థులతో ఆయన సమీక్ష జరిపారు. పోలింగ్‌ శాతం భారీ స్థాయిలో పెరుగుదలకు కారణం తామేనని... ఆ ఓట్లన్నీ తమవేనని ఆ పార్టీ అధిష్టానం ధీమాగా ఉంది.

మహిళలు, యువత పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనడం పట్ల ఆ పార్టీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ పోలింగ్ శాతం తమకు అనుకూల ఉంటుందని భావిస్తోంది. సమీక్ష సందర్భంగా అభ్యర్థులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

దీనిపై ఆ పార్టీ సీనియర్ నేతల కోటగిరి విద్యాధరరావు స్పందిస్తూ.. పలువురు అభ్యర్థులు అత్యుత్సాహంతో తాము గెలుస్తామని ధీమాగా చెపుతున్నారు. అంత మాత్రాన అన్నీ నిజాలైపోతాయా? మా అధినేత వద్ద వాస్తవ సమాచారముందని అన్నారు.

ఇదిలావుండగా, పార్టీకి సహకరించకుండా వెన్నుపోటు పొడిచిన అభ్యర్థులను పార్టీ కార్యాలయం గడప తొక్కనీయొద్దంటూ చిరంజీవి హుకుం జారీ చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై స్పందించే విషయంలో అందరికంటే ముందుండాలన్నారు.

ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా, ఎక్కడ చూసినా ప్రజారాజ్యమే కనిపించాలని అధినేత ఆదేశించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అభ్యర్థులంతా గెలిచినా.. ఓడినా పార్టీ కార్యాలయానికి రావాలని ఆయన సూచించారు.

వెబ్దునియా పై చదవండి