"మంజీరా, కొండాపూర్" అందాలను చూసొద్దాం రండి..!!

FILE
దేశ విదేశాల నుంచి తరలివచ్చే వందలాది రంగుల వలస పక్షుల సందడితో సందడి చేసే మంజీరా ప్రాజెక్టు.. ఆ ప్రాజెక్టు ఆవరణలోని మొసళ్ల పెంపక కేంద్రంలోని రకరకాల మొసళ్ల రాజసాలు.. అక్కడికి సమీపంలో ఉండే గార్డెన్ పచ్చదనపు సోయగాలు.. వీటన్నింటిని గూర్చి తెలియజెప్పే విధంగా బొమ్మల రూపంలో ఉండే ప్రదర్శనశాల.. పరవళ్లు తొక్కుతూ ప్రవహించే మంజీరా నది గలగలలు... "మంజీరా, కొండాపూర్"ల సొంతం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలం సంగారెడ్డి. ఈ సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని కల్పగూర్‌లో గల "మంజీరా ప్రాజెక్టు (మంజీరా వన్యప్రాణి అభయారణ్యము)", అలాగే మరో మండలమైన కొండాపూర్‌లో గల "మ్యూజియం" ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. సంగారెడ్డి పట్టణం నుంచి 5 కిలోమీటర్ల దూరంలోగల మంజీరా ప్రాజెక్టు.. తదితర ప్రాంతాలకు విదేశాల నుంచి వచ్చే వలస పక్షులు జనవరి నుంచి డిసెంబర్ మధ్యకాలంలో తరలివస్తుంటాయి.

వలస పక్షులు ఈ కాలంలో ప్రాజెక్టు ప్రాంతంలోనే గూళ్లు కట్టుకుని జీవిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. అందుకే వీటిని చూసేందుకు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఆదివారం రోజున ఈ ప్రాంతంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఈ ప్రాజెక్టు ఆవరణలో ఉండే మొసళ్ల పెంపక కేంద్రం కూడా వీక్షకులకు కనువిందు చేస్తుంది. దీనికి దగ్గర్లోనే గార్డెన్ కూడా ఉండటంతో దూర ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

FILE
విదేశీ పక్షులు, మంజీరా ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టు, మొసళ్ల పెంపక కేంద్రం తదితరాలపై ఇక్కడ బొమ్మల రూపంలో ఏర్పాటు చేసే ప్రదర్శన శాల పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఫిల్టర్ బెడ్, సంప్‌హౌజ్‌లను కూడా సందర్శించి.. నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారన్న తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రవహించే మంజీరానది పరీవాహ ప్రాంతాల్లోని సుందర దృశ్యాలు వీక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఇక్కడికి వెళ్లాలంటే సంగారెడ్డి నుంచి నిత్యం ఆటోలు వెళుతుంటాయి. కానీ పర్యాటక శాఖ నుంచి ఎలాంటి సౌకర్యాలు ప్రస్తుతానికి లేవు, స్తోమత ఉన్నవారు సొంత, ప్రైవేటు వాహనాల్లో వెళ్లవచ్చు.

శాతవాహనుల కాలంలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా విలసిల్లిన కౌండిన్యపురమే నేటి కొండాపూర్. ఇక్కడి మ్యూజియం పర్యాటకులకు ఆనాటి సంస్కృతికి కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. క్రీస్తుపూర్వం 37 నుంచి క్రీస్తుశకం 14 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల కాలంనాటి చిహ్నాలు, ముద్రిత నాణేలు, బంగారుపూత నాణేలు ఇక్కడి త్రవ్వకాలలో బయటపడ్డాయి.

రోమన్ చక్రవర్తి పోన్‌టిఫ్ అగస్టిన్ ముద్రిత రూపం గల బంగారు నాణేలు కూడా ఇక్కడ లభించాయి. అలాగే రోమన్ చక్రవర్తి టైబేరియన్ రూపం కలిగిన పతకం, పురాతన పనిముట్లు, నాణేలు, మట్టి పాత్రలు, మట్టి బొమ్మలు, చుక్కల పళ్లెములు తదితరాలు ఈ మ్యూజియంలో కొలువై సందర్శకులను ఆకట్టుకుంటాయి.

ఈ కొండాపూర్ మ్యూజియం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. 9వ నెంబర్ జాతీయ రహదారి మీదుగా పెద్దాపూర్ కూడలి నుంచి 7 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నగరానికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంవల్ల ఈ మ్యూజియాన్ని ఇంకా అభివృద్ధి చేసినట్లయితే.. పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి