రాయలసీమ వేసవి విడిది హార్సిలీ హిల్స్

Pavan Kumar

శనివారం, 24 మే 2008 (18:51 IST)
రాయలసీమ ప్రాంతంలో ఏకైక వేసవి విడిది కేంద్రం హార్సిలీ హిల్స్. హార్సిలీ కొండలపై ఉన్నటువంటి విహార కేంద్రం కాబట్టి హార్సిలీ హిల్స్ అనే పేరు వచ్చింది. పచ్చని అడవులు, ఔషధ గుణాలు గల చెట్లతో అలరారుతోంది హార్సిలీ హిల్స్.

కడప జిల్లా అప్పటి కలెకర్ట్ స్వర్గీయ డబ్ల్యూడీ హార్సిలీ హయాంలో ఇక్కడ వేసవి విడిది కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కాలగమనంలో ఈ ప్రాంతానికి హార్సిలీ హిల్స్‌గా పేరొచ్చింది. సముద్ర మట్టానికి 1,265 అడుగులు ఎత్తులో హార్సిలీ హిల్స్ ఉంది. హార్సిలీ కొండలపై యూకలిప్టస్, అల్లమంద, జాక్రండ వంటి వృక్షాలు ఉన్నాయి.

హార్సిలీ హిల్స్‌ సంపెంగ పూలకు ప్రసిద్ధి. సంపెంగ సువానలతో హార్సిలీ హిల్స్ కొత్త వాతావరణాన్ని తలపిస్తుంది. హార్సిలీ కొండల వాలుపై సంపెంగ పూల చెట్లను ఇక్కడి చెంచు జాతులు నాటారు. వీటితో పాటుగా చందనం, ఎర్రచందనం, కలప, రీటా, షీకాకాయ, ఉసిరిగ చెట్లు ఇక్కడ కోకొల్లల్లుగా ఉన్నాయి.

చూడవలసిన ప్రాంతాలు
రిషీ వ్యాలీ స్కూల్

ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ రిషీ వ్యాలీ స్కూల్‌ను ఏర్పాటుచేశారు. ఈ పాఠశాలలో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్ధులు ఇక్కడే ఉంటూ విద్యాభ్యాసం చేస్తారు.

మల్లమ్మ దేవాలయం

హార్సిలీ హిల్స్ ప్రముఖ దేవాలయం మల్లమ్మ. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడకు అమ్మవారి దర్శనం కోసం వస్తారు.

కౌండిన్య వన్యప్రాణి సంరక్షణా కేంద్రం
కౌండిన్య వన్యప్రాణి సంరక్షణా కేంద్రం హార్సిలీ హిల్స్‌కు 87 కి.మీ. దూరంలో ఉంది. ఈ కేంద్రంలో ఏనుగులు, చిరుత పులులు, అడవి పిల్లులు, నక్కలు, పులులు వంటివి ఉన్నాయి. అలాగే ఔషధ గుణాలు గల చెట్లు ఉన్నాయి.

వసతి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీటీడీసీ) కి చెందిన హోటెల్ ఉంది. ఏపీటీడీసీ పున్నామి హోటెల్‌లో ఆధునిక సదుపాయాలు గల 44 గదులు ఉన్నాయి. అద్దె రేట్లు రూ.800 నుంచి రూ.2600 వరకూ ఉన్నాయి. అలాగే డార్మిటరీ సదుపాయం కూడా ఉంది.

ఎలా చేరుకోవాలి

విమాన మార్గం : తిరుపతి (160 కి.మీ.), బెంగళూరు (165 కి.మీ.) లలో విమానాశ్రయాలు ఉన్నాయి.

రైలు మార్గం : పాకాల-ధర్మవరం మార్గంలో మదనపల్లి రోడ్ సమీపంలోని రైల్వే స్టేషన్. మదనపల్లి నుంచి మదనపల్లి స్టేషన్‌కు 13 కి.మీ., హార్సిలీ హిల్స్ 43 కి.మీ. దూరంలో ఉంది. పాకాల-ధర్మవరం మీటర్ గేజి మార్గం ప్రస్తుతం గేజి మార్పిడి పనులు జరుగుతున్నారు. రైలు ప్రయాణం ప్రస్తుతం అనుకూలం కాదు.

రహదారి మార్గం : తిరుపతి, బెంగళూరు, కడప, అనంతపురం, కర్నూలు, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్‌ల నుంచి నేరుగా బస్సులు మదనపల్లికి ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి