గాంధీ హిల్‌కు కొత్త కళ... భవానీ ద్వీపంలో వెలుగుల ఉద్యానవనం
శుక్రవారం, 6 జులై 2018 (19:07 IST)
మహాత్ముడు నడయాడిన గాంధీ కొండ కొత్త రూపును సంతరించుకోనుంది. నాడు విజయవాడకు శాస్త్ర సాంకేతిక పర్యాటక ప్రాంతంగా విరాజిల్లిన ఈ కొండ కాలక్రమంలో ఆధునీకరణకు నోచుకోక, గత కొంతకాలంగా పర్యాటక ఆదరణకు దూరమైంది. ఈ పరిస్థితిని గమనించిన ఆంధ్రప్రదేశ్ టూరిజం అధారిటీ ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. గాంధీ హిల్ పౌండేషన్ ఆధీనంలో ఈ కొండ ఉండగా, ప్రభుత్వ ఆకాంక్షల మేరకు పరస్పర అంగీకారంతో ఈ పర్యాటక ప్రాంతాన్ని అభివృధ్ది చేయనున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం అమరావతి ప్రాంత పర్యాటక అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోగా, శుక్రవారం జరిగిన ఎపిటిఎ పాలకమండలి సమావేశం కొండ ఆధునీకరణకు రూ.5 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించింది. పాలక మండలి ఛైర్మన్, పర్యాటక భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశం ఈ మేరకు ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది.
ఈ మొత్తంతో గాంధీ కొండ రూపురేఖలు మార్చాలని, విజయవాడలో భవానీ ద్వీపం మాత్రమే పర్యాటక అవసరాలను తీర్చుతున్నతరుణంలో దీనికి కూడా పూర్తి స్ధాయిలో కొత్త రూపు తీసుకు రావాలని మీనా సూచించారు. భవానీ ఐలండ్ టూరిజం కార్పోరేషన్ ఈ పనులకు సంబంధించిన కార్యాచరణను చేపట్టనుండగా, గాంధీ హిల్ పౌండేషన్ పెద్దలతో పర్యాటక శాఖ అధికారులు ఇప్పటికే పలు మార్లు భేటీ అయ్యారు.
తొలుత రూ.3.15 కోట్లతో ఒక్క నక్షత్రశాలను మాత్రమే ఆధునీకరించాలని తొలుత భావించినా, పాలక మండలి సమావేశం నిధుల సమస్య రాకుండా చూస్తామని, అన్నివిభాగాలను ఆధునీకరించి పర్యాటక భరితంగా తీర్చి దిద్దాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలో మీనా మాట్లాడుతూ అక్కడి పిల్లల రైలును తిరిగి నడపాలని, అదే క్రమంలో గ్రంధాలయ భవనానికి మెరుగులు దిద్ది ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాలని అన్నారు. సర్వాంగ సుందరంగా కొండ ప్రాంతం ఉండాలని ల్యాండ్ స్కేపింగ్ మంచి ఆర్కిటెక్చర్‌కు అప్పగించాలని బోర్డు నిర్ణయించింది.
మరోవైపు భవానీ ద్వీపంలో వెలుగుల ఉద్యానవనం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ టూరిజం అధారిటీ పాలక మండలి నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా పదిలక్షలకు పైగా ఎల్ఇడిలతో వెలుగుల ఉద్యానవనం తీర్చిదిద్దనున్నారు. ఈ వెలుగులు కృష్ణానదిలో ప్రతిబింబించనుండగా, అమరావతి ప్రాంతానికి కొత్త అందాలను సమకూర్చుతాయి. సాధారణంగా మొక్కలతో జంతువులు, పక్షుల ఆకారాలను తీర్చిదిద్దటం మనం చూస్తుంటాం, ఈ వెలుగుల ఉద్యానవనంలో అవన్ని ఎల్ఇడి వెలుగుల ద్వారానే రూపుదిద్దుకుంటాయి.
ఈ నేపధ్యంలో టూరిజం అధారిటీ సిఇఓ హిమాన్హు శుక్లా మాట్లాడుతూ, వెలుగుల ఉద్యానవనం ప్రపంచ శ్రేణి పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ఉండనుందని, సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఉద్యోగుల పునర్ నిర్మాణంకు సంబంధించి అంశాలు పాలక మండలి ఎజండా అంశాలుగా ఉండగా వాటిని ప్రభుత్వ పరిశీలనకు పంపాలని మీనా నిర్ణయించారు. ఈ సమావేశంలో సంస్ధ పాలనా వ్యవహారాల సంచాలకులు డాక్టర్ సాంబశివ రాజు తదితరులు పాల్గొన్నారు.