ఓ వైపు కింద పరవళ్లు తొక్కుతూ ప్రవహించే నదీ ప్రవాహం.. పైన తాళ్లతో వేలాడే చెక్క వంతెన... అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వంతెనపై నడుస్తూ నదిని దాటాలంటే ఎవరికైనా గట్స్ ఉండాల్సిందే..! మరోవైపు పెద్ద లోయ.. కిందికి చూస్తే ప్రాణాలు పైపైనే పోతాయన్న భయం.. అలాంటి చోటుకి కొండ పైనుంచి కిందికి తాళ్లతో జారుకుంటూ పోతే... తలచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ...? అలాగే.. గలగలా పారే నదిలో రయ్‌మంటూ దూసుకెళ్లే మరపడవ.. ఆ పడవలో మీరు భలే ఉంటుంది కదా..! ఇలాంటి సాహసాలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పలు ప్యాకేజీలను నిర్వహిస్తోంది.
సాహసాలు అనేవి మనసుకు థ్రిల్లింగ్‌ను కలిగిస్తాయి. అవి శరీరానికి మంచి వ్యాయామం కూడా.. ఉరుకుల పరుగుల జీవితంలో విసుగెత్తిపోయేవారు ఇలాంటి ప్రదేశాల్లో ఒక రోజంతా సేదతీరవచ్చు. ఇందుకోసం ఏపీ పర్యాటక శాఖ అనేక రకాల పర్యాటక ప్రదేశాలను ఎంపిక చేసి.. అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. సుదూర ప్రాంతాలతోపాటు హైదరాబాద్ నగరానికి సమీపంలోగల కీసర గుట్టవద్ద ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ లాంటివి నిర్వహిస్తోంది.
హార్స్లీ హిల్స్‌లో ట్రెక్కింగ్..!
హార్స్లీ హిల్స్... రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ చేసే వారికి ఎంతో అనువైన ప్రదేశం. ఇక్కడ రోప్‌వే సౌకర్యం కూడా ఉంది. ప్రకృతి సోయగాల మధ్య.. చల్లటి పిల్ల గాలులు శరీరాన్ని అలా తాకుతూ వెళుతుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ ప్రాంతానికి కూడా పర్యాటక..
ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, రివర్ క్రాసింగ్, బోట్ రైడింగ్ తదితర సాహసాలకు ఎక్కడో విదేశాలకు లేదా పక్క రాష్ట్రాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే ఇలాంటి పర్యాటక ప్రదేశాలు బోలెడన్ని ఉన్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం, యాదగిరి గుట్ట, భద్రాచలం, కుప్పం, బాసర, హార్స్లీ హిల్స్ తదితర ప్రాంతాలు.. అలాంటి వాటిలో కొన్ని. ఈ ప్రాంతాల్లో పర్యాటక శాఖ అన్ని అవకాశలను కల్పించటంతోపాటు.. పగలు, రాత్రి వేళల్లో అక్కడే ఉండి గడిపే విధంగా కూడా ప్యాకేజీలను రూపొందించిది. ఇక.. వసతి, భోజన సౌకర్యాలు కూడా ఆ శాఖే చూస్తుంది కాబట్టి.. దిగులేమీ ఉండదు.
ఆ ప్యాకేజీలేంటో ఇప్పుడు చూద్దామా...?!
కీసర గుట్ట... హైదరాబాద్‌కు సమీపంలో ఉంది. ఇక్కడ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాక్ క్లైంబింగ్ నిర్వహిస్తున్నారు. గ్రూపుల వారీగా వెళ్లిన వారికి ప్రత్యేక రాయితీలు ఉంటాయి కూడా. అయితే రవాణా సౌకర్యాలను మాత్రం పర్యాటకులే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లైంబింగ్‌కు మాత్రం గ్రూపును బట్టి కొంత రుసుమును వసూలు చేస్తుంటారు.
FILE
నాగార్జున సాగర్... ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల నాగార్జున సాగర్..! ఇక్కడి కృష్ణానదిలో బోట్ రైడింగ్ ఎంతో థ్రిల్లింగ్ కలిగిస్తుంది. హైదరాబాద్ నుంచి వసతి, భోజనం, రవాణా తదితర సౌకర్యాలతో పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలను కల్పిస్తోంది. అలా కాకుండా ఎవరికివారు వారి సొంత ఖర్చులతో, ప్రైవేటు వాహనాలతో కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.
హర్స్‌లీ హిల్స్... మదనపల్లికి సమీపంలో ఈ కొండలు ఉన్నాయి. రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ చేసే వారికి ఇది ఎంతో అనువైన ప్రదేశం. ఇక్కడ రోప్‌వే సౌకర్యం కూడా ఉంది. ప్రకృతి సోయగాల మధ్య.. చల్లటి పిల్ల గాలులు శరీరాన్ని అలా తాకుతూ వెళుతుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ ప్రాంతానికి కూడా పర్యాటక శాఖ అన్ని రకాల సౌకర్యాలతో ప్యాకేజీలను అందిస్తోంది.
శ్రీశైలం... ట్రెక్కర్లకు ఇదో స్వర్గధామం. మల్లిఖార్జునస్వామి కొలువైన ఈ ప్రాంతంలోని నల్లమల అటవీ అందాలు కనువిందు చేస్తుంటాయి. ఈ అడవుల్లోని జలపాతాలు మరో అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. రవాణా, లాడ్జింగ్, బోడ్జింగ్ తదితర అన్ని రకాల సౌకర్యాలతో ఏపీ టూరిజం శాఖ ప్యాకేజీలను కల్పిస్తోంది.
భద్రాచలం... పరవళ్లు తొక్కే గోదావరి ఒడ్డున కొలువైన ప్రదేశం భద్రాచలం. సీతారాములు కొలువైన ఈఆధ్యాత్మిక ప్రదేశంలో రాక్ క్లైంబింగ్‌కు అనువైన కొండలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడికి కూడా టూరిజంశాఖ అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతోంది.
యాదగిరిగుట్ట... లక్ష్మీ నరసింహస్వామి కొలువైన ప్రదేశం ఇది. ఇక్కడి ఎత్తైన కొండపైకి రాక్ క్లైబ్లింగ్ చేస్తే ఆ అనుభూతే వేరు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ క్షేత్రానికి ఉదయం వెళితే సాయంత్రానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి ప్రైవేటు వాహనాలలో, సొంత ఖర్చులతోనూ వెళ్లవచ్చు లేదా.. టూరిజం శాఖ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.