సునీతగారూ... మీ తండ్రిగారు, తల్లిగారు, సోదరుని జాతక వివరాలు
శనివారం, 4 ఆగస్టు 2012 (23:01 IST)
FILE
మీ తండ్రి ముసలయ్యగారు దశమి శుక్రవారం కర్కాటక లగ్నము, పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి నందు జన్మించారు. 2014 చివరి వరకూ అర్థాష్టమ శనిదోషం ఉన్నా మీకు ఈ శని మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. 2013 లేక 2014 నందు మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. నిరుత్సాహం వీడి సద్వినియోగం చేసుకోండి. 2010 నుంచి రవి మహర్దశ ప్రారంభమయింది. ఈ రవి 2013 నుంచి 2016 వరకూ సత్పలితాలను ఇస్తుంది. రాజకీయంగానీ, సాంఘికపరంగానూ మంచిపేరు, ఖ్యాతి గడిస్తారు. అనుకోని అవకాశాలు లభించి మంచి గుర్తింపు పొందుతారు. చంద్రశేఖరుని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగి అభివృద్ధి పొందుతారు.
మీ తల్లి ఆదిలక్ష్మిగారు విదియ శుక్రవారం, కుంభ లగ్నము, పూర్వాషాఢ నక్షత్రం, ధనుర్ రాశి నందు జన్మించారు. ధన, కటుంబ స్థానము నందు కేతువు ఉండటం వల్ల ధనం ఎంత సంపాదించినా నిలబడకపోవడం ఉంటుంది. భర్త స్థానము నందు యముడు ఉండటం వల్ల భర్త తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. రాజ్యస్థానము నందు రవి, బుధులు ఉండటం వల్ల మీ భర్తకు మంచిపేరు, ఖ్యాతి లభిస్తుంది. 2013 నుంచి గురు మహర్దశ 16 సంవత్సరములు మంచి అభివృద్ధినివ్వగలదు. కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి. ప్రతిరోజూ కనకధార స్తోత్రం చదివినా లేదా విన్నా సర్వదా శుభం కలుగుతుంది.
మీ సోదరుడు రవికుమార్ చవితి బుధవారం, మిధునలగ్నం, పుబ్బ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించడం వల్ల గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల, శంఖపాల కాలసర్పదోషం శాంతి చేయించిన సర్వదా అభివృద్ధి చేకూరుతుంది. ఉద్యోగ, వ్యాపార స్థానము నందు కేతువు ఉండటం వల్ల ఎందులోనూ వీరు పూర్తిగా స్థిరపడలేకపోయారు. 2011 నుంచి కుజ మహర్దశ ప్రారంభమయింది. ఈ కుజుడు 2013 అక్టోబరు నుంచి 2018 వరకూ యోగాన్ని ఇస్తాడు. తదుపరి రాహు మహర్దశ 18 సంవత్సరములు మంచి యోగాన్ని పొందుతారు. మీ పేరుతో ఏజెన్సీ, కాంట్రాక్టు, ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్స్ కు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. సొంతంగా కానీ భాగస్వామికంగా కానీ చేసిన కలిసి వస్తుంది. ప్రతిరోజూ భవానీ అష్టకం చదివినా లేక విన్నా శుభం కలుగుతుంది.