అనారోగ్యాలకు చెక్ పెట్టాలంటే.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలంటే?
శుక్రవారం, 19 జనవరి 2018 (10:54 IST)
వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలా? అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలా? అయితే ఈ టిప్స్ పాటించండి. ఎండబెట్టిన ఉసిరికాయలు, ఉసిరిపొడిని తీసుకోవడం ద్వారా జలుబు, దగ్గు, జ్వరం వంటివి దూరమవుతాయి. ఇందులో విటమిన్ సితోపాటు కాల్షియం, ఐరన్, పాస్ఫరస్, ఫైబర్‌లు అధికంగా ఉంటాయి.
ఆయుర్వేద ప్రకారం ఉసిరి శరీరంలో ఏర్పడే అనారోగ్యాలకు కారణమైన మూడు రకాల దోషాలైన వాత, పిత్త, కఫాల హెచ్చు తగ్గులను నియంత్రిస్తుంది. మన దేహంలోని రోగ నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది. అలాగే పసుపును ఆహారంలో తీసుకోవాలి. పసుపు రోగ నిరోధక వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. సాధారణ జలుబు, పొడి చర్మం, కీళ్ల నొప్పులు, వాపులు వంటి అనారోగ్యాలకు ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
అతిమధురం వేర్లు అనేక రకాల అనారోగ్యాలకు ఔషధాలుగా పనిచేస్తాయి. శరీరంలో ఏర్పడే వాతాన్ని ఇది తగ్గిస్తుంది. దీంతోపాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దగ్గు, గొంతు నొప్పి, బ్రాంకైటిస్, లైంగిక సామర్థ్యం, చర్మ సమస్యలు, పచ్చకామెర్లు తదితర ఎన్నో రకాల వ్యాధులకు ఇది మందుగా ఉపయోగపడుతుంది.
గ్లాస్ గోరు వెచ్చని నీటిలో చిటికెడు అతి మధురం వేర్ల పొడిని కలిపి రోజుకు 4 నుంచి 5 సార్లు పుక్కిలిస్తే నోట్లో పొక్కులు, ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో, కోల్పోయిన శక్తిని తిరిగి ఇవ్వడంలో అశ్వగంధ మెరుగ్గా పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాలు ఇందులో మెండుగా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఇక అల్లాన్ని వంటల్లో చేర్చడం మరిచిపోకూడదు. శరీరంలో ఏర్పడే వాత, కఫ దోషాలను అల్లం తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు ఇన్‌ఫెక్షన్లపై పోరాటం చేస్తుంది. పలు శ్వాసకోశ వ్యాధులను తగ్గించే గుణం అల్లంకు ఉంది. రోజూ పరగడుపునే ఒక టీస్పూన్ అల్లం రసం సేవిస్తే రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.
యాంటీ ఆస్తమాటిక్, యాంటీ ఇన్‌ఫెక్టివ్ గుణాలు తులసిలో పుష్కలంగా ఉన్నాయి. శ్వాసకోశ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తులసి ఆకుల రసాన్ని నిత్యం తీసుకుంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ గాడిలో పడుతుంది. అల్లం, తేనె వంటి వాటితో దీన్ని కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.