ఉప్పు తిన్న పాపానికి అని తెలుగులో సామెత ఉంది కదా. అతి చౌక వస్తువు అయిన ఉప్పును అధికంగా తీసుకుంటే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది కాని ఉప్పు పూర్తిగా మానేస్తే కూడా ప్రమాదమే మరి. అందుకనే శరీరానికి పోషక విలువలను అందించడానికి గతంలో ఉప్పులో అయోడిన్ కలిపితే ఇప్పుడు నేరుగా ఇనుమునే కలపమని వైద్యులు సిపార్సు చేస్తున్నారు మరి.
శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత ఆక్సిజన్ అందాలి. రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమగ్లోబిన్ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. రక్తం తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయలేకపోయినా, ఎర్రరక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నా రక్తహీనతకు దారితీస్తుంది.
ఇందుకు ప్రధాన కారణం ఇనుము లోపం. ఎందుకంటే ఎర్రరక్త కణాలు తయారుకావాలంటే ఇనుము, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి12 వంటి పోషకాలు కావాలి. ఐరన్ లోపం కారణంగా రక్తహీనతతో పాటు అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే మన శరీరానికి అవసరమైన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
మనం రోజూ తినే అన్నం ద్వారా కూడా ఇనుము పొందగలిగే రోజు రానుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఇనుము శాతాన్ని పెంచి, ఫెటేట్స్ పరిమాణాన్ని తగ్గించి జన్యుపరివర్తిత బియ్యాన్ని తయారుచేస్తున్నారు.
అయోడైజ్ ఉప్పు మాదిరిగా ఉప్పులో ఇనుము కూడా కలుపుతున్నారు. దీనిలో ఇనుము, అయోడిన్ సమాన పరిమాణంలో ఉంటాయి. పేద, ధనిక తేడా లేకుండా అందరూ వాడే వస్తువు ఉప్పు. అందుకే ఉప్పును ఎంచుకున్నారు. అయితే రెండేళ్ళ కన్నా తక్కువ వయసు పిల్లలకు ఇది ఉపయోగకరం కాదు.
జాతీయ పోషకారహార సంస్థ నేషనల్ అనీమీయా కంట్రోల్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఇనుము, ఫోలిక్ ఆమ్లం సప్లిమెంట్లను సరఫరా చేయాలని సంకల్పించింది. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వారానికి ఒక ట్యాబ్లెట్ చొప్పున చిన్నారులకు అందివ్వగలిగితే చాలా వరకు ఇనుము లోపాలను అధిగమించవచ్చు. ఒక్కో ఐరన్ ట్యాబ్లెట్‌లో వంద మిల్లీగ్రాముల ఐరన్, 0.5 మిల్లీ గ్రాముల ఫోలిక్ ఆమ్లం ఉంటాయి.
కాబట్టి ఉప్పులో ఏముంది ఘనత అని తీసిపారవేస్తే ఇకపై కష్టమే అని వైద్య నిపుణులు అంటున్నారు.