గర్భిణీలు ఎప్పుడూ నవ్వుతూ వుంటే ఇమునిటీ పెరుగుతుందట!

శుక్రవారం, 8 మే 2015 (18:07 IST)
గర్భిణీ మహిళలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని గైనకాలజిస్టులు అంటున్నారు. అంతేకాకుండా సంతోషంగా ఉంటే గర్భిణీలు స్ట్రెస్ హార్మోన్ల బారినపడరు. గర్భిణీలు ఆహార విషయంలో మెలకువ వహించాలి. రోజూ 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి. ఇలా చేస్తే చర్మం బాగా మెరుస్తుంది.

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయి. ప్రెగ్నెన్సీ టైమ్‌లో హైపర్‌పిగ్మంటేషన్‌ అంటే చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడడం సహజం. ఇవి రాకుండా రోజూ సన్‌స్క్రీన్‌ను వాడాలి. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి బయటకు వెళ్లినపుడల్లా గర్భిణీలు తప్పనిసరిగా టోపీ, సన్‌గ్లాసెస్‌ ధరించాలి.
 
గర్భిణి ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. విశ్రాంతి తీసుకోవడం వల్ల చర్మం రంగు పెరగడమే కాదు నిద్ర కూడా బాగా పడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే శరీరానికి మంచిది. వ్యాయామాలు చేయడం వల్ల ప్రసవం సులభంగా అవుతుంది. కండరాల బలం పెరుగుతుంది. వ్యాయామాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. గుండె బాగా పనిచేసేలా చేస్తాయి.
 
గర్భం ధరించిన మహిళల్లో హార్మోన్ల సంఖ్య బాగా పెరుగుతుంది. ఫలితంగా చర్మంలో ఎక్కువ ఆయిల్స్‌ ఉత్పత్తి అయి చర్మం జిడ్డుగా తయారవుతుంది. అందుకే చర్మాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో తయారు చేసే ఫేస్‌ మాస్కులు రాసుకుంటే గర్భిణీల చర్మం మరింత నునుపుగా తయారవుతుంది. 
 
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉన్న ఆహారాన్ని బాగా తీసుకోవాలి. అవకెడొ, బ్లూబెర్రీస్‌, దానిమ్మ, పుచ్చకాయ వంటివి తింటే చాలా మంచిది. వీటిల్లోని యాంటాక్సిడెంట్ల వల్ల చర్మం మెరవడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే చికెన్‌, ఫిష్‌, గుడ్లు బాగా తినాలి. వీటిల్లో ఎనర్జీనిచ్చే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కడుపులో ఉన్న బిడ్డ పెరగడానికి ఇవి దోహదపడతాయని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి